తెలంగాణలో 101 హాట్‌స్పాట్‌లు

ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు
తెలంగాణలో 471కి చేరుకున్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య
385 మంది మర్కజ్‌ వెళ్లొచ్చిన వారే
మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి

ప్రజాపక్షం/హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 471కి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. గురువారం ఒక్కరోజే 18 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని, ఒకరు మృతి చెందారని మంత్రి వెల్లడించారు. గురువారం సాయంత్రం ఈటల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. గురువారం వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరిందన్నారు. వీరిలో 45 మంది డిశ్చార్జ్‌ కాగా.. 12 మంది మృతి చెందినట్టు వివరించారు. 471 పాజిటివ్‌ కేసుల్లో 385 మంది మర్కజ్‌ వెళ్లొచ్చిన వారు, వారిని కలిసి వ్యక్తులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. మర్కజ్‌ కేసులు లేకపోయి ఉంటే ఇప్పటికే తెలంగాణ కరోనా రహిత రాష్ట్రంగా ఉండేదన్నారు. నేటి నుంచి ఈ కేసులు తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఉన్న రోగులు ఏప్రిల్‌ 22వ తేదీ వరకు కోలుకునే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో 101 హాట్‌స్పాట్‌లను గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. కింగ్‌ కోఠి ఆస్పత్రిలో ఓపీ నిర్వహిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. గురువారం 665 నమూనాలను పరీక్షిస్తే కేవలం 18 మందికి మాత్రమే పాజిటివ్‌  వచ్చిందన్నారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌ కేసులకు మాత్రమే చికిత్స ఉంటుందన్నారు. గాంధీ, చెస్ట్‌, కింగ్‌ కోఠి ఆస్పత్రుల్లో 414 మందికి చికిత్స జరుగుతోందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సలహాలు, సూచనలు పాటించి ఇళ్లకే పరిమితం కావాలని కోరుతున్నామన్నారు. ఎక్కడెక్కడ పాజిటివ్‌ కేసులు వచ్చాయో అక్కడ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారని ఈటల తెలిపారు. సిఎం కెసిఆర్‌ ఇచ్చిన పిలుపును గౌరవించి ప్రజలందరూ 99శాతం నిజాయతీగా ఆచరించడం వల్లే ఈ కేసులు తగ్గాయన్నారు. మర్కజ్‌ కేసులు రావడం.. లాక్‌డౌన్‌పాటించడం రెండూ ఒకేసారి జరగడం వల్ల కొంతవరకు అధిగమించగలిగామన్నారు. చిన్న ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉండేవాళ్లు మాకు సమాచారం ఇవ్వాలని, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

DO YOU LIKE THIS ARTICLE?