1001

రాష్ట్రంలో వెయ్యి మార్కు దాటిన కరోనా కేసులు
కొత్తగా 11 కేసులు నమోదు

ప్రజాపక్షం/హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటింది. ఆదివారంనాడు కేవలం 11 కేసులు మాత్రమే నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. కొత్తగా ఆదివారం నమోదైన పాజిటివ్‌ కేసులన్నీ జిహెచ్‌ఎంసి పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అదేసమయంలో కొత్తగా వ్యాధి నుంచి కోలుకొని 9 మంది డిశ్చార్జి అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 316కి చేరింది. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించకపోవడం హర్షదాయకం. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌ 19 కారణంగా 25 మంది మరణించారు. ఇంకా 660 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో అత్యధికంగా జిహెచ్‌ఎంసి పరిధిలోనే 540 పాజిటివ్‌లు నమోదయ్యాయి. రెండోస్థానంలో సూర్యాపేట నిలిచింది. అక్కడ ఇప్పటివరకు 83 కేసులు నమోదయ్యాయి. తదుపరి స్థానాల్లో నిజామాబాద్‌ (61), గద్వాల్‌ (45), వికారాబాద్‌ (37), రంగారెడ్డి (33), వరంగల్‌ అర్బన్‌ (27)లు వున్నాయి. కాగా, ప్రజలందరూ మాస్కులు ధరించాలని, ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇంట్లోనే ఉంటూ సమాజిక దూరం పాటించాలని ఆరోగ్య శాఖ కోరింది.

DO YOU LIKE THIS ARTICLE?