10% కోటా అమలు 1వ తేదీ నుంచే

న్యూఢిల్లీ: అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన (ఇడబ్ల్యుఎస్‌) వారికి ప్రభు త్వ ఉద్యోగాలు, విద్యలో పది శాతం రిజర్వేషన్‌ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా, కోటా అమలు ప్రక్రియకు సంబంధించి నియమ నిబంధనలతో కూడిన వివరణాత్మక జాబితాను వేర్వేరుగా జారీ చేయనున్నట్లు సిబ్బంది మంత్రిత్వశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, సేవల్లో పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని, ప్రత్యక్షంగా నియమకాలు జరిపే అన్ని రకాల ఖాళీల్లో కాటా ఫిబ్రవరి 1, 2019 నుంచి అమల్లోకి ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇప్పటికే రిజర్వేషన్‌లు పొందుతున్న ఎస్‌సి, ఎస్‌టి, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తులు ఈ పది శాతం కోటా కిందకు రారని, సంవత్సరానికి 8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలు మాత్రమే అర్హులని సామాజిక న్యాయం, సాధికరత మంత్రిత్వశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ఐదు ఎకరాల వ్యవసాయ భూమి, గుర్తించబడిన మున్సిపాలిటీల్లో వేయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌, వంద చదరపు గజాల ప్లాట్‌, మున్సిపాలిటీ కానీ ప్రాంతాల్లో 200 చదరపు గజాల నివాసిత ప్లాట్‌ ఉన్న అగ్రవర్ణాల వారు ఇందుకు అనర్హులని తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో తహసీల్దార్‌ కేటగిరీకి తక్కువ కాకుండా ఉన్న అధికారి గుర్తించిన కుటుంబ ఆదాయం, ఆస్తుల సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి. కాగా, రిజర్వేషన్‌ అమలు ప్రక్రియకు సంబంధించిన నియమ నింబధనల జాబితాను మానవ వనరుల అభివృద్ధి మంత్వ్రితశాఖ త్వరలోనే విడుదల చేయనుంది.

DO YOU LIKE THIS ARTICLE?