HomeNewsBreaking Newsపట్టు వారిదే!

పట్టు వారిదే!

కీలక శాఖల్లో ఇన్‌ఛార్జ్‌ అధికారులే
సోమేశ్‌కుమార్‌, సునీల్‌శర్మ, అనిల్‌ కుమార్‌, శాంతి కుమారిలకు వారి శాఖలుండగా.. ఇంకా అదనపు బాధ్యతల అప్పగింత
మాకు సమర్ధత లేదా?.. తమనెందుకు పరిగణనలోకి తీసుకోరని ఎస్‌సి, ఎస్‌టి సీనియర్‌ ఐఎఎస్‌ల ఆవేదన

ప్రజాపక్షం/హైదరాబాద్‌: రాష్ట్రంలో కీలకమైన ప్రభుత్వ శాఖల్లో ఇన్‌ఛార్జ్‌ అధికారులదే హవా.. వారు ఏది చెబితే అదే కరెక్టు.. ఏది కాదంటే అది అంతే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే కీలకమైన మంత్రిత్వశాఖలను తన వద్దనే ఉంచుకుని పర్యవేక్షిస్తున్నారో.. సరిగ్గా అదే రీతిలో ఉన్నతాధికారులకు కూడా కీలకమైన శాఖలకు ఇన్‌ఛార్జ్‌లుగా కొనసాగుతుండడం కాకతాళీయమే అయినా అభివృద్ధి కార్యక్రమాలను మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడేనన్న చందంగా సాగుతున్నాయన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇన్‌ఛార్జ్‌ అధికారుల పాలన కొనసాగుతుండడం వల్ల ఇలా జరుగుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటయ్యాయి. అయితే పెరిగిన జిల్లాలకు తోడు సరిపడే అఖిల భారతస్థాయి అధికారులు లేకపోవడంతో చాలా ప్రభుత్వ శాఖల్లో ఇన్‌ఛార్జ్‌ల ఆధ్వర్యంలోనే పాలన కొనసాగుతోంది. సీనియర్‌ ఐఎ ఎస్‌లే కాదు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నీటి పారుదల శాఖకు ముఖ్య కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్‌.కె. జోషి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తుండడం విశేషం. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషించే రెవెన్యూశాఖ, ఆదాయ ఆర్జనలో కీలక శాఖలైన ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌శాఖ, అలాగే ఖజానా పింపే వాణిజ్యపన్నుల శాఖ, ఇంకా రవాణా శాఖలన్నింటీలోనూ ఇన్‌ఛార్జ్‌ అధికారులే కొనసాగుతుండడం గమనార్హం. రాష్ట్రంలో వరుస ఎన్నికల తో కోడ్‌ అమలులో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్‌ అనుమతితో ప్రమోషన్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆ అధికారులను అదే శాఖల్లోనూ, ఇంకా చెప్పాలంటే అవే స్థానాల్లో నియమించడం గమనార్హం. “నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికున్న వాటాను సమర్ధవంతంగా వినియోగించుకుని కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఇంత కీలకమైన ఈ శాఖ ఇటీవల సుమారు రూ.25వేల కోట్ల బడ్జెట్‌తో కాళేశ్వరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులను అమలు చేస్తోంది. ఇంత కీలకమైన నీటి పారుదలశాఖకు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ముగ్గురి నుండి నలుగురు ఐఎఎస్‌ అధికారులు పర్యవేక్షించేవారు. ఎంత మంది అధికారులు ఉన్నా సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు సాగునీటి విషయంలో ఒరిగిందేమీలేదని ప్రభుత్వం చెబుతున్న మాటను ఎవరూ కాదనని సత్యం. ఇంత కీలకమైన నీటిపారుదల శాఖ సుమారు గత మూడు సంవత్సరాల నుండి ఒకరిద్దరు అధికారులతోనే నడుస్తోంది. ఎస్‌కే జోషి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులు కావడంతో ప్రభుత్వం ఆయన్నే ఈ శాఖకు ఇంత వరకు ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తోంది. ఒక రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వేరే శాఖకు పూర్తి అదనపు బాధ్యతతో ఇన్‌ఛార్జ్‌గా కొనసాగడం ఇదే మొదటి సారని పలువురు సీనియర్‌ ఐఎఎస్‌ ఉన్నతాధికారులు వ్యాఖ్యానిస్తుండం గమనార్హం. ఒక్క ఎస్‌కే జోషినే కాదు.. ఇలాగే గ్రామ స్థాయి పరిపాలనను పర్యవేక్షించడానికి ఉండే భూ పరిపాలనశాఖ ప్రధాన అధికారి (సిసిఎల్‌ఏ) పదవి కూడా ప్రస్తుతం రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతుండడం విశేషం.

Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments