హైదరాబాద్‌లో కెసిఆర్‌ సభ లేనట్టే

క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాలని టిఆర్‌ఎస్‌ నిర్ణయం

ప్రజాపక్షం/ హైదరాబాద్‌: హైదరాబాద్‌ ఎన్నికల ప్రచార సభకు జన సమీకరణలో ముఖ్యనేతలు, మంత్రులు వైఫల్యం చెందడంతో టిఆర్‌ఎస్‌ అప్రమత్తమైంది. సభలు, సమావేశాలు కాకుండా ఇక క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఇక హైదరాబాద్‌లో టిఆర్‌ఎస్‌ అధినేత, సిఎం కెసిఆర్‌ ఎన్నికల ప్రచార సభ దాదాపు ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా చేవేళ్ల, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ నియోజవకర్గాల కేంద్రంగా ఎల్‌.బి.స్టేడియంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాలని, తద్వారా ఒక వేదికద్వారా మూడు నియోజకవర్గాలకు దిశ నిర్దేశం చేసే అవకాశం ఉంటుందని సిఎం కెసిఆర్‌ భావించారు. కానీ శుక్రవారంనాడు చేపట్టిన సభకు ఆశించిన స్థాయి కంటే కనీస స్థాయిలో కూడా జన సమీకరణ చేయకపోవడంతో అర్థాంతరంగా కెసిఆర్‌ తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. జన సమీకరణ వైఫల్యంతో పాటు ముఖ్య నాయకులు, మంత్రుల పనితీరుపై కూడా కెసిఆర్‌ ఇదివరకే ఆరా తీసినట్లు తెలిసింది. ఇప్పటి వరకు జరిగిన టిఆర్‌ఎస్‌ సభలలో ఇలాంటి పరిస్థితి లేదని, ఇక నుంచి పూర్తిగా ఈ మూడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలు, అలాగే ఇద్దరు మంత్రులపై ఆధారపడకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని టిఆర్‌ఎస్‌ భావించినట్లు సమాచారం. ఈ మూడు నియోజకవర్గాలకు టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి.రామారావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. పైగా మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ నియోజకవర్గ అభ్యర్థులు మంత్రుల వారసులు కావడంతో ఆ నియోజవకర్గ బాధ్యతలను సదరు మంత్రులు పూర్తిగా తమ భుజస్కందాలపై వేసుకున్నారు. దీంతో ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలపై పెద్దగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండకపోవచ్చని పలువురు టిఆర్‌ఎస్‌ నేతలు భావించారు.

DO YOU LIKE THIS ARTICLE?