హైదరాబాద్‌కు హ్యాట్రిక్‌ ఓటమి..

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టి20 టోర్నీ
ఢిల్లీ: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 టోర్నీలో హైదరాబాద్‌ ఓటముల పరంపరా కొనసాగింది. టోర్నీలో వరుసా ఓటములతో సతమతమవుతున్న హైదరాబాద్‌ తాజాగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలై హ్యాట్రిక్‌ సాధించింది. గ్రూప్‌ భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బరోడా 4 వికెట్లతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ధనాధన్‌ టోర్నీలో హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్స్‌ మరోసారి ఘోరంగా విఫలమయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. జట్టు స్కోరు 13 పరుగుల వద్దే ఓపెనర్‌ తన్మయ్‌ అగర్వాల్‌ (4) పరుగులు చేసి వెనుదిరిగాడు. తర్వాత ఫస్ట్‌ డౌన్‌గా వచ్చిన హిమాలయ్‌ అగర్వాల్‌ (8) పరుగులే చేసి ఔటవడంతో హైదరాబాద్‌ 32 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత అక్షత్‌ రెడ్డి, బి. సందీప్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరుకొద్ది సేపటివరకు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును ముందుకు నడిపించారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన పిచ్‌పై కుదుకున్న తర్వాత పరుగుల వేగాన్ని పెంచారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ 50 పరుగుల మార్కును దాటింది. అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు కొడుతూ ఈ జంట పరుగులను రాబట్టింది. చివరికి బరోడా బౌలర్‌ అతీత్‌ సేత్‌ తెలివైన బంతితో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టి హైదరాబాద్‌కు పెద్ద షాకిచ్చాడు. దీంతో కీలక ఇన్నింగ్స్‌ ఆడుతున్న అక్షత్‌ రెడ్డి (46; 44 బంతుల్లో 5 ఫోర్లు) పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. తర్వాత హైదరాబాద్‌ కెప్టెన్‌ అంబటి రాయుడుతో కలిసి సందీప్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు సాగించాడు. ఈక్రమంలోనే హైదరాబాద్‌ 100 పరుగుల మార్కును పూర్తి చేసుకుంది. తర్వాత రిషీ అరొథే హైదరాబాద్‌కు మరో షాకిచ్చాడు. ధాటిగా ఆడుతున్న సందీప్‌ (39; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను అరొథే ఆవుట్‌ చేశాడు. తర్వాత ఒక్క పరుగు వ్యవధిలోనే కె. సుమంత్‌ (0) కూడా ఖాతా తెరువకుండానే పెవిలియన్‌ చేరాడు. దీంతో వరుసక్రమంలో వికెట్లు కోల్పోయిన హైదరాబాద్‌ ఒత్తిడికి లోనైంది. చివర్లో రాయుడు కూడా (17) పరుగులు చేసి సేత్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. తర్వాతి బ్యాట్స్‌మెన్స్‌ కూడా పరుగులు చేయకపోవడంతో హైదరాబాద్‌ నిర్ణీత ఓవర్లలో 131/7 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో రిషీ అరొథే 4 వికెట్లు పడగొట్టగా.. అతీత్‌ సేత్‌ 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బరోడాను హైదరాబాద్‌ స్పిన్నర్‌ మెహదీ హసన్‌ హడలెత్తించాడు. ఇతని ధాటికి దూకుడుగా ఆడుతున్న ఓపెనర్లు వేదర్‌ దేవధర్‌ (9), మోహిత్‌ మోంగియా (7) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. తర్వాత విష్ణు సోలంకి (40; 38 బంతుల్లో 4 ఫోర్లు), దీపక్‌ హూడా (35; 30 బంతుల్లో 5 ఫోర్లు) అద్భుతమైన బ్యాటింగ్‌తో బరోడాను ఆదుకున్నారు. తర్వాత సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ యూసుఫ్‌ పఠాన్‌ (0) ఖాతా తెరువకుండానే భండారీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. చివర్లో హైదారబాద్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. చివర్లో గొప్ప ఇన్నింగ్స్‌ ఆడిన స్వప్నిల్‌ సింగ్‌ 29 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 36 పరుగులు చేసి బరోడాను విజయాతీరానిక చేర్చాడు. చివర్లో స్వప్నీల్‌ సింగ్‌ దూకుడుగా ఆడి తమ జట్టును గట్టెక్కించాడు. దీంతో బరోడా 19.4 ఓవర్లలో 134/6 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్‌ బౌలర్లలో మెహదీ హసన్‌, సివి మిలింద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. అకాశ్‌ భండరీకి ఒక వికెట్‌ దక్కింది. వికెట్లు తీయడంలో విఫలమైన ప్రధాన బౌలర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఈ మ్యాచ్‌లోనూ భారీ పరుగులు సమర్పించుకున్నాడు. రెండు ఓడర్లు వేసిన సిరాజ్‌ ఏకంగా 34 పరుగులు ఇచ్చుకున్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?