హుజూరా‘వార్‌’

రసవత్తరంగా మారుతున్న బై పోల్‌
టిఆర్‌ఎస్‌, బిజెపి వాగ్వాదం
ఇరువర్గాల మాటల యుద్ధం
పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ప్రజాపక్షం/హుజురాబాద్‌:ఈటల రాజీనామాతో అనివార్యమైన హుజూరాబాద్‌ బైపోల్‌ రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. నిన్న మొన్నటి వరకు టిఆర్‌ఎస్‌, బిజెపి మధ్య మాటల యుద్ధం నడిచినా గురువారం ఘర్షణ వరకు దారి తీసింది. ఈటల జమున సోదరుడు మధుసూదన్‌ రెడ్డి దళితులను కించపరుస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేశారంటూ ఆరోపిస్తూ ఉదయం టిఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మధూసూదన్‌ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అనంతరం ఈటల సతీమణి జమున తన సోదరుడి మీద కావాలనే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేశారంటూ, తాము దళితులకు వ్యతిరేకంకాదని అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అప్పటికే ఇ దంతా గమనిస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు ఈటల రాజేందర్‌ ఫ్లెక్సీ పట్టుకొని వచ్చి దళిత ద్రోహి అంటూ నినాదాలు చేస్తూ చౌరస్తాకు చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఒకరినొకరు దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా మాటల యుద్ధం కాస్త ఒకరినొకరు నెట్టివేసుకుంటూ వివాదానికి దారితీసింది. ఒకవర్గంపై ఇంకో వర్గం చెప్పులు విసురుకున్నారు. దీంతో హుజురాబాద్‌ ఛౌరస్తా రణస్థలిగా మారింది. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కావాలనే టిఆర్‌ఎస్‌ నాయకులు బిజెపిపై దుష్పచారం చేస్తున్నారని అన్నారు. దళితబంధు స్కీం దళితుల మధ్య చిచ్చు పెడుతోందన్నారు. అధికార పార్టీ ఓడిపోతారని భయంతో కావాలనే ఈటల రాజేందర్‌పై సోషల్‌ మీడియాలో ఫేక్‌ న్యూస్‌లతో దుష్పచారానికి తెర తీశారని అన్నారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను నిలువరించే ప్రయత్నం చేసినా వినకుండా గొడవ మరింత జఠిలం చేశారు. కొంతసేపు బిజెపి నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ శ్రీనివాస్‌ ఇరువర్గాలను శాంతిపజేయడంతో గొడవ సద్ధుమణిగింది.
కెసిఆర్‌ దిష్టిబొమ్మ దహనం.. ః
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మ దహనాలను నిరసిస్తూ బిజెపి దళిత సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌ అమరవీరుల స్థూపం వద్ద కెసిఆర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ దళిత వ్యతిరేకి కాదన్నారు. దళితులకు ఇచ్చే దళితబంధును ఈటల రాజేందర్‌ వద్దని అనలేదన్నారు. కెసిఆర్‌ మాట మీద ఉండే వ్యక్తి అయితే పది రోజుల్లో రాష్ట్రంలోని దళితులు అందరికీ పది లక్షల రూపాయలు వారివారి అకౌంట్లలో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి అనుబంధ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?