హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తివేత

మూసీలోకి నీరు విడుదల
మూసీ పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తత
ప్రజాపక్షం/హైదరాబాద్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపుగా ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరడంతో మంగళవారం జలమండలి అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. హిమాయత్‌ సాగర్‌ రిజ్వాయర్‌కు మొత్తం 17 గేట్లు ఉన్నాయి. గత ఏడాది అక్టోబర్‌ 14న జలాశయానికి 25 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తడంతో 13 గేట్లు ఎత్తి దిగువన ఉన్న మూసీలోకి వదిలిన విషయం తెల్సిందే. హిమాయత్‌ సాగర్‌ గేట్లు తెరిచే ముందు మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జంట జలాశయాలు నిం డుకుండలా మారాయి. ఉస్మాన్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా, ప్రస్తు తం 1784.60 అడుగులకు చేరుకుంది. హిమాయత్‌ సాగర్‌
పూర్తిస్థాయి నీటిమట్టం 1763 అడుగులకు చేరుకోవడంతో గేట్లు ఎత్తివేశారు.
గేట్లు ఎత్తే ముందు జాగ్రత్తలు తీసుకున్నాం : దాన కిషోర్‌
హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తే ముందు జాగ్రత్తలు తీసుకున్నామని జలమండలి ఎం.డి. దానకిషోర్‌ తెలిపారు. జలాశయానికి నీరు పోటెత్తడంతో ఇప్పటివరకు 3 గేట్లను ఒక్క అడుగు వరకు ఎత్తివేశామన్నారు. దీంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసీనది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. బోర్డు సిబ్బంది మూసీనదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలో దాదాపు అన్ని మ్యాన్‌హోళ్లకి సేఫ్టీగ్రిల్స్‌తో పాటు, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎర్ర జెండాలు ఏర్పాటు చేశామన్నారు. నగరంలో అత్యవసరంగా స్పందించే బృందాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో, పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లను, అధికార యంత్రాగాలతో పాటు, జిహెచ్‌ఎంసి, పోలీసు అధికారులను దాన కిషోర్‌ అదేశించారు.

హిమాయత్‌ సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టం : 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి : 1763.00 అడుగులు
రిజర్వాయర్‌ పూర్తి సామర్థ్యం : 2.968 టిఎంసిలు
ప్రస్తుత సామర్థ్యం : 2.773 టిఎంసిలు

 

DO YOU LIKE THIS ARTICLE?