హామీల అమలు ఎలా?

ఖాళీ ఖజానాపై సర్కార్‌ తర్జనభర్జన!
పథకాల అమలుకే రూ.10 వేల కోట్లు అవసరం
కోడ్‌ ఎప్పుడు ముగుస్తుందా అని ఆయా వర్గాల నిరీక్షణ
హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితుల్లో ఉందా? ఇప్పటికే వివిధ పథకాలకు ఇచ్చిన హామీలు, వాటి అమలుకు నిధులు కేటాయించకుంటే పరిస్థితులేంటీ? తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. రైతుబంధు, రైతు రుణమాఫీ, శాసన సభ, స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ తదితర కారణాలు ఏమైనప్పటికీ ఖజానా దాదాపు ఖాళీ అయినట్లు చెబుతున్నారు. రాష్ట్ర అవసరాలు తీరాలంటే ప్రస్తు తం కనీసం రూ. 10 వేల కోట్లపైనే నిధులు కావాలని అధికార వర్గాలు అంచనా వేశాయి. ఇన్ని వేల కోట్ల నిధులను రాష్ట్రంలోనే వివిధ రూపాల్లో సమీకరించుకోవాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాక పోవచ్చని చెబుతున్నారు. తప్పని సరిగా కేంద్ర ప్రభుత్వంపై గానీ, లేదా రిజర్వు బ్యాంక్‌ ద్వారా గానీ అప్పులు చేయాల్సిందేనని ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ. 4000 కోట్లు ఓవర్‌ డ్రాఫ్ట్‌ ఉన్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్‌ నెల ఉద్యోగుల, పెన్షనర్ల జీత భత్యాలు కోసం ఆర్‌బిఐని అప్పు అడగ్గా వారు ఇవ్వలేమని ప్రభుత్వ చీఫ్‌ సెక్రటరీకి తెలిపినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను గమనంలో ఉంచుకునే అసెంబ్లీలో ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ స్థానంలో గత ఫిబ్రవరిలో ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్‌ అంతా సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికే ఎక్కువ నిధులు ఖర్చు అయ్యాయి. 2018- ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రైతాంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత నిచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే పంటల పెట్టుబడి పథకానికి రూ. 12,000 కోట్లు వెచ్చించింది. ఎకరానికి రూ. 4 వేల వంతున రెండు పంటల కోసం రెండు విడుతల్లో ప్రతి రైతుకు రూ. 8000 లెక్కన అందజేసింది. ఈ పంట పెట్టుబడి కూడా యాసంగి పంట పెట్టుబడిని నవంబర్‌ నుండి అలాగే పునాస పంట పెట్టుబడిని ఏప్రిల్‌ నెల నుండి అందజేసింది. సమైక్య రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల పరంపర కొనసాగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ ఆ తరహా అన్నదాతల ఆత్మహత్యలను చూడకూడదన్న లక్ష్యానికి అనుగుణంగా ఇలా పంట పెట్టుబడి పథకం, అలాగే రైతు బీమా వంటి రైతాంగ పథకాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చినట్లు పేర్కొంది. తాను చెప్పినట్లుగానే గత ఆర్థిక సంవత్సరం రైతు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి రూ. 500 కోట్లు కేటాయించింది. బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి చేయకుండా రైతాంగానికి తక్షణ తోడ్పాటునందించే లక్ష్యంతో మొదట 35,29,950 మంది రైతులకు బ్యాంకుల్లో వారి రుణాల మాఫీ కింద రూ. 16, 124 కోటను బ్యాంకర్లకే చెల్లించి రుణమాఫీ చేసింది.
కోడ్‌ ఎప్పుడు ముగుస్తుందా..!
గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు ఇచ్చే రూ. వెయ్యి పెన్షన్‌ను రూ. 2016కు, వికలాంగులకు రూ. 1500 నుండి రూ. 3016కు పెంచడం ద్వారా ఖజానాపై రూ. 12,067 కోట్ల భారం పడింది. ఇప్పటికే ఆర్‌బిఐ నుండి పొందిన రూ. 6 వేల కోట్లను సింహభాగం కాళేశ్వరం తదితర ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు వినియోగించారు. రోడ్లు భవనాల శాఖ కాంట్రాక్టర్లు పెండింగ్‌ బిల్లుల కోసం గత 9 మాసాలుగా నిరీక్షిస్తున్నారు. మిషన్‌ భగీరథ బిల్లుల బకాయిల పరిస్థితి అలాగే ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును ప్రస్తుతం ఉన్న 60 ఏళ్ల నుండి 61 సంవత్సరానికి పెంచడంతో ఈ ఏడాది మార్చి నాటికి 1100 మంది ఉద్యోగులు, జూన్‌ నాటికి 1600 మంది ఉద్యోగుల దాకా రిటైర్‌ కాన్నుట్లు అధికారులు గుర్తించారు. రిటైర్‌ అయ్యే వారికి ఒక్కో ఉద్యోగికి వారి రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌తో సహా అన్నీ కలిసి ఒక్కో ఉద్యోగికి రూ. 20 లక్షల దాకా చెల్లించాల్సి ఉందని సమాచారం. అదీ రెండు నెలల్లోనే క్లియర్‌ చేయక తప్పని పరిస్థితి నెలకొని ఉంది. ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతిని హామీగానే ఉంచుతారా? లేదా ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించి హామీ నిలబెట్టుకుంటారా? అని నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. నిరుద్యోగులు అంటే ఎవరు? అని అసెంబ్లీలో వచ్చిన ప్రశ్నపై ప్రభుత్వం ఏకంగా ఒక కమిటీనే వేసింది. ఈ కమిటి నివేదికను ఆలస్యం చేస్తే మళ్లీ యువత భగ్గున మండే ఛాన్స్‌ లేక పోలేదని భావిస్తున్నారు. మళ్లీ రైతు బంధు, పంట పెట్టుబడి సాయం ఏటా ఉండేవేనని వారు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఆర్థిక పరంమైన ఈ అంశాలన్నీ కూడా గత తొమ్మిది మాసాలుగా ఎన్నికల కోడ్‌ పేరిట చర్చకు రాకుండా కాలం నెట్టుకొస్తున్నా ఈ నెల 23న లోక్‌సభ ఫలితాల వెల్లడితో ఆ కోడ్‌ కూడా ముగియనుండడంతో ఎంచేలా ? అని ఆర్థికశాఖ అధికారులు, ఇతర వ్యవసాయ తదితర ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?