హవ్వ.. ఇదేపని

పిల్లలతో మొక్కలు నాటిస్తారా!
చిన్నారులను బాలకార్మికులుగా మారుస్తున్న అటవీశాఖ అధికారులు
తక్కువ కూలీ ఇస్త్తూ ప్లాంటేషన్‌లో పనులు చేయిస్తున్న వైనం
ప్రజాపక్షం/ కొత్తగూడ కరోనా కష్ట కాలంలో ఇంటి వద్ద అన్‌లైన్‌ తరగతులు వింటూ విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన చిన్నారులతో బాధ్యత కలిగిన అటవీశాఖ అధికారులు అడవిలో మొక్కలు నాటిస్తూ బాల కార్మికులుగా మారుస్తున్నారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు రెంజ్‌ పరిధిలోని కొత్తగూడ మండలం చిట్యాలగడ్డ అటవీ ప్రాంతంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. అడవుల పెంపుదల, పునరుద్ధరణ కోసం ‘కంపా’ కింద వస్తున్న నిధులతో అటవీ ప్రాంతాలలో మొక్కలు నాటే ‘ప్లాంటేషన్‌’ కార్యక్రమాన్ని అటవీ శాఖ నిర్వహిస్తున్నది. ఇందు కోసం కూలీలతో అటవీ ప్రాంతాలలో మొక్కలు నాటిస్తూ ఒక్కో మొక్కకు రూ.6 నుంచి రూ.7 లు చెల్లిస్తారు. ఇంత వరకు బాగానే ఉన్నా గూడూరు రెంజ్‌ పరిధిలోని అటవీ అధికారులు లాక్‌డౌన్‌ కారణంగా ఇంటివద్ద ఉంటున్న ఆరవ తరగతి నుండి తోమ్మిదవ తరగతి చదువుకుంటున్న విద్యార్థులను తీసుకెళ్లి పాదులు తీయిస్తూ మొక్కలు ననాటిస్తున్నారు. ఈ పనులకు పిల్లలను ఉపయోగించుకోవడమే నేరమంటే అటవీ అధికారులు కనీసం ఆ రూ.6 లనైనా పిల్లలకు ఇస్తున్నారంటే అదీ లేదు. వారికి ఇచ్చే రూ.6 లలో రూ.1 కోత పెట్టి రూ. 5 చెల్లిస్తున్నారని ఒక విద్యార్థి ‘ప్రజాపక్షం’ విలేకరికి తెలిపాడు. జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ బాల కార్మికుల వ్యవస్థ నిర్మూళనే ధ్వేయంగా పనిచేయాలని అధికారులకు పిలుపునిచ్చి రెండు రోజులు కూడా గడవక ముందే అటవీశాఖ సెక్షన్‌ అధికారి చిన్నారులతో పనులు చేయించడం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పట్ల ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్న చిత్తవుద్దిని తెలియజేస్తున్నదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విషయాన్ని అటవీ శాఖ గూడూరు రేంజ్‌ అధికారి అమృత దృష్టికి తీసుకురాగా చిన్నారులను పనుల్లోకి తీసుకెళ్లిన విషయం తన దృష్టికి రాలేదని, ఈ విషయాన్ని పరిశీలించి ఉన్నతాధిదికారులకు తెలియపరుస్తామని చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?