స్వీయ నిర్బంధంలో ఉండండి!

ప్రజలనుద్దేశించి విరుష్కలు ట్వీట్‌
న్యూ ఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర రూపం దాలుస్తున్న కరోనా వైరస్‌ (కొవిడ్‌-19)ను అరికట్టడానికి ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండాలని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు అభిమానులకు పిలుపునిచ్చారు. తాజాగా కోహ్లీతో కలిసి అనుష్కశర్మ ఓ వీడియో రూపొందించారు. దాన్ని ఆమె ట్విటర్‌లో షేర్‌ చేయగా, కోహ్లీ రీట్వీట్‌ చేశాడు. మనమంతా ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నామని, వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలంతా సమష్టిగా కృషి చేయాలని చెప్పారు. అందరి క్షేమం కోసం తామిద్దరం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉంటున్నామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని పిలుపునిచ్చారు. అందరూ ఇళ్లలోనే ఉంటూ ఆరోగ్యంగా ఉండి వైరస్‌ వ్యాప్తిని నివారించాలని కోరారు. ఇదిలా ఉండగా కోహ్లీ అంతకుముందు.. ప్రధాని నరేంద్రమోదీ గురువారం సూచించిన ‘జనతా కర్ఫ్యూ’ కార్యక్రమంపైనా స్పందించాడు. ప్రజలందరూ మోదీ చెప్పినట్లు ఈ ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండాలని విజ్ఞప్తి చేశాడు. మరోవైపు భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 206 కేసులు నమోదు కాగా నలుగురు వ్యక్తులు మృతిచెందారు.

DO YOU LIKE THIS ARTICLE?