స్వీయ గృహ‌నిర్బంధం విక‌టిస్తోందా?

కరోనా చైనా దేశ సరిహద్దులు దాటిన తొలి దశలోనే ఈ రోజు గైకొం టున్న చర్యలను క్రమాను గతంగా కేంద్రప్రభుత్వం అమలు జరిపి వుంటే ఈ పరిస్థితి ఇంతకాడకు వచ్చే ది కాదు. నేడు ఇవి అసమ గ్రంగా వున్నాయి. స్వీయ నిర్భంధ మొక్కటే పైకి కన్పిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులు కాలిన తర్వాత చేతులేత్తి దేశ ప్రజ లను వేడుకొని స్వీయ నిర్భంధంలోనికి వెళ్లమని కోరడం గుడ్డిలో మెల్ల. ఇందుకోసం కర్ఫ్యూలు పోలీసులు లాఠీఛార్జీలు ప్రయోగించవలసి వస్తోంది. ఈ మహమ్మారి నిర్మూలనకు కఠిన చర్యలు చేపట్టడం తప్పు పట్టలేం. ఇట లీ, స్పెయిన్‌ అనుభవాలను దష్టిలో పెట్టుకుని మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి వుండగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. గమనార్హమైన మరో అంశమేమంటే చైనా నుండి వచ్చిన వారికన్నా ఇతర దేశాల నుండి మన దేశానికి వచ్చిన వారే రోగం బారిన పడి వచ్చారు. ఇతర దేశాల్లో కరోనా వ్యాపించే వరకు మనకు ఎక్కువ సమయం వుంది. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేదు.
తొలి రోజుల్లోనే కరోనా ప్రభావిత దేశాల నుండి వచ్చే వారిని ప్రచారం కోసం విమానాశ్రయాల్లో, పోర్టుల్లో థర్మల్‌ గన్‌తో పరీక్షించి ఇళ్లకు పంపివేశారు. ఇక్కడే పెద్ద తప్పు చేశారు. ఇందులోనూ మరో ట్విస్ట్‌ వుంది. ఇలా వచ్చినవారు తమకు టెంపరేచర్‌ వున్నా ముందుగా జాగ్రత్తపడి పారాసిట్మల్‌ వేసుకొని విమానాశ్రయాలను దాటేశారు. ఈ తతంగమంతా టీవీల్లో చూచిన వెర్రిజనం ఇంకేం ఫర్వాలేదనుకున్నారు. ఇలా వచ్చిన వారు అధికా రుల కనుగప్పి లేదా అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా విచ్చలవిడిగా తిరిగిన ఫలితంగా దేశంలోని పలు రాష్ట్రా లు రెండవ దశకు చేరుకున్నాయి. విదేశాల నుండి రోగాలతో వచ్చిన వారు స్థానికులకూ కరోనా అంటిం చారు. అదే ఇప్పుడు కొంప కొల్లేరు చేస్తోంది. ఇంత జరుగుతున్నా స్వీయ నిర్భంధ విధానం అమలుపైననే రాష్ట్రాలు కేంద్రీకరిస్తున్నాయి. ఇది కొంతలో కొంత ఊరట కలిగిస్తోంది.
మిగిలిన రాష్ట్రాల అంశం పక్కనబెడితే రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ సరిగానే అమలు చేస్తున్నారు. అయినా, పలు పట్టణాల్లో ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. కొన్నిచోట్ల పోలీసులు లాఠీలకు పని చెబుతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కరోనా అంశంలో దాదాపు ప్రధమ దశలో వుంది. స్థానికంగా ఏదో ఒక కేసు నమోదైనదంటున్నారు. దురదష్టం కొద్దీ రెండవ దశలో ప్రవేశించామంటే మనకున్న మౌలిక సదుపాయాల కొరత దష్ట్యా కరోనాను అదుపు చేయడం అసాధ్యం.
ఈ నెల 26వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం విదేశాల నుండి 26,590 మంది రాష్ట్రానికి వచ్చారని వీరిలో 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో వుంచి వైద్యులు పర్యవేక్షించుతున్నారని వుంది. ఇంకా మరి కొంతమంది రావచ్చు.
కరోనా రెండవ దశకు చేరడానికి వీరే నేడు ప్రమాదకరంగా తయారౌతారేమో. ఇప్పటికే ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గానికి వంద ఐసోలేషన్‌ పడకలు ఏర్పా టు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఆచరణలో అమలు నోచుకున్నట్లు లేదు. లేకుంటే వీరినందర్నీ ఐసొలేషన్‌ క్యాంపులకు తరలించేవారు. ముఖ్యమంత్రి ప్రకటన యుద్ధ ప్రాతిపదికన అమలు జరిగి వుంటే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో 17500 పడకలతో పాటు జిల్లా కేంద్రంలో 200 పడకలు చొప్పున మొత్తం 2600 లతో కలుపు కొంటే దాదాపు 20 వేల పడకలు అందుబాటు లోనికి వచ్చి వుండాలి. ఈ నేపథ్యంలో విదేశాల నుండి వచ్చిన ప్రతి వ్యక్తిని ఒక నిర్ణీత కాలం ఈ పథకంలో భాగంగా క్వారంటైన్‌ క్యాంపులు ఏర్పాటు చేసి విధిగా వుంచి కరోనా లక్షణాలు లేని వారిని నిర్ణీత గడువు ముగియగానే విడతల వారీగా ఇళ్లకు పంపి వుంటే విదేశాల నుండి కరోనాతో వచ్చిన వారు స్థానికులకు రోగం అంటించడం సులభంగా నిరోధించి వుండవచ్చు. కాని అలా జరగ లేదు. ఈ రోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానం అమలు చేయక పోతే త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ రెండవదశకు చేరక తప్పదు.
ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విదేశాల నుండి వచ్చిన వారిని గుర్తించడమైతే చేస్తున్నారు. గుర్తింపు దశలో రోగ లక్షణాలు లేని వారిని వారి ఇళ్ల వద్దనే వుండమని చెప్పి అధికారులు చేతులు దులుపుకొంటున్నాను. రోగ లక్షణా లు గల వారిని మాత్రమే వారి కుటుంబీకులతో సహా వార్డులకు తరలిస్తున్నారు.
నిపుణులు డాక్టర్లు చెబుతున్న దేమంటే పాతిక లేక ముప్పయి సంవత్సరాల వయసు గల వారిలో రోగ నిరో ధక శక్తి వున్నందున పది రోజులకు గాని రోగ లక్షణాలు బయటపడటం లేదు. ఇంకో అంశం గమనంలోనికి తీసుకోవాలి. ప్రస్తుతం విదేశాల నుండి వచ్చే వారంతా పాతిక సంవత్సరాల వయసువారుగా వున్నారు. ఫలి తంగా అధికారులు పరిశీలన చేసే సమయంలో ఎక్కువ మంది ఆరోగ్యంగానే వుంటున్నారు. వారిని తమ ఇళ్ల వద్ద వుండమని చెప్పి అధికారులు వస్తున్నారు. కాని వారు అధికారుల సూచనలను ఏమాత్రం పాటించకుండా తిరుగుతున్నారు. కర్ఫ్యూలాంటి నిబంధనలు అమలు జరిపినా రోడ్ల మీదకు జనం వచ్చే అనుభవం కళ్ల ముందు వుండగా విదేశాల నుండి వచ్చే వారు అధికారుల సూచనలను పాటిస్తారని నమ్మడం వెర్రితనమే.
విదేశాల్లో రోగం బారిపడి వచ్చిన యువకులు నాలు గైదు రోజులు గడచిన తర్వాత రోగ లక్షణాలు కనిపించ గానే ఆసుపత్రులకు వస్తున్నారు. ఈ లోపు వీరు రోగం ఎంతమందికి అంటించుతున్నారో గణాంకాలు లేవు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఒక కేసులో ఇంతే జరిగింది. తుదకు అతనికి రోగం బయట పడ్డ తర్వాత అతన్ని కుటుంబీకులతో సహా తరలించారు. ఇలాంటి కేసు గుంటూరులో వెలుగు చూచిందంటున్నారు. పైగా ఈ మహానుభావుడు విందుకు హాజరయ్యారని చెబుతున్నా రు. వీరంతా ఈలోపు ఎంతమందిని కలిశారో అధికారు లు ఆరా తీసినా సమగ్రమైన సమాచారం రాదు. దుర దష్టం కొద్దీ ఏమైనా జరిగితే ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ కేసులే రాష్ట్రంలో 8 – 9 కేసులుగా నమోదు అయ్యాయి. తుదకు విజయవాడలో పదవ కేసు నమోదైంది.
ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ప్రకారం నియోజక వర్గానికి కనీసం 50 పడకలు ఏర్పాటు చేసి ప్రధమ చర్యగా విదేశాల నుండి వచ్చే వారినందరిని విధిగా క్వారంటైన్‌ కేంద్రాలకు ఎప్పటికప్పుడు తరలించి వుంటే స్థానికులకు కరోనా వ్యాపించడం సులభంగా అరికట్టి వుండవచ్చు. ఇందుకు చట్టపరంగా వెసులుబాటు వుంది. రాష్ట్రంలో అట్టి ప్రయత్నాలు జరగడం లేదు. ఇదిలా వుండగా చాలా మంది ప్రజాప్రతినిధులు అధికారు లు ప్రజలకు ఉచితంగా మాస్కులు శానిటైజర్లు ఇస్తున్నారు. రోగ లక్షణాలు లేనివారు మాస్కులు వేసుకో వలసిన అవసరం లేదని కొందరు నిపుణులు చెబుతున్నా రు. పైగా మార్కెట్‌ లభ్యమయ్యే మాస్కులు కరోనా వ్యాధి నిరోధకానికి పనిచేయవని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో తుడ చైర్మన్‌ తన నియోజకవర్గంలో మూడు లక్షల వరకు ఇవి ఉచితంగా పంపకం చేశారు. సంతో షించదగ్గ అంశమే. కాని తుడ పరిధిలో గల తిరుపతిలో విదేశాల నుండి వచ్చిన వారినందర్నీ ప్రభుత్వం తరపున ఐసోలేషన్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందులో వుంచి వుంటే ఎంతో ఉపకరించేది. ఈ అంశంపై తిరుపతి నుండి డాక్టర్‌ సుధాకరరెడ్డి ట్విట్టర్‌లో పోస్టింగ్‌ పెడుతూ విదేశాల నుండి వచ్చిన వారు అధికారులు పోగానే ఒక అపార్టు మెంట్‌లో అంతా తిరుగుతున్నారని ఆవేదన వెల్లడించారు. రాష్ట్రంలో పలువురు ప్రజాప్రతినిధులు ప్రచారం కోసం ఇలాంటి తరహా చర్యలు తీసుకుంటున్నారే గాని వాస్త వంలో కరోనా వ్యాప్తి అరికట్టే చర్యలు తీసుకోవడం లేదు.
ప్రస్తుతం అమలు జరుగుతున్న స్వీయ నిర్భంధం మంచిదే. ఆక్షేపించవలసినది కాదు. ఒక పక్క ప్రజలు అష్టకష్టాలు పడి ఇళ్లకే పరిమితమౌతుంటే విదేశాల నుండి వచ్చే వారు తాము ఆరోగ్యంగా వున్నామంటూ హోం ఐసోలేషన్‌లో వుంటామని చెబుతూ అధికారుల కళ్లు గప్పి చక్కర్లు కొడితే చాప కింద నీరు లాగా మరో వైపు స్థానికులకు ఏదో ఒక రూపంలో కరోనా అంటించే ప్రమాదం పొంచి వుంది.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విదేశాల నుండి వచ్చే ప్రతివారిని హోం ఐసోలేషన్‌లో కాకుండా ప్రభుత్వం నిర్వహించే క్వారంటైన్‌ల్లో నిర్ణీత కాలం వుంచి తదుపరి వారి ఇళ్లకు పంపితే స్వీయ నిర్భంధానికి ఇది తోడై త్వరలోనే కరోనాను అరికట్టవచ్చు.

(విశాలాంధ్ర సౌజ‌న్యంతో)

DO YOU LIKE THIS ARTICLE?