సేనలు వెనక్కి!

భారత్‌, చైనా సైన్యాల మధ్య పరస్పర అంగీకారం
న్యూఢిల్లీ: చైనా సరిహద్దులో ఆరువారాల సుదీర్ఘ ఉద్రిక్త పరిస్థితులు శాంతించే అవకాశాలు కన్పిస్తున్నాయి. సరిహద్దులో సైన్యాలను ఉపసంహరించుకునేందుకు ఇరుదేశాల సైన్యాలు పరస్పరం అంగీకారం తెలిపాయి. గల్వన్‌ లోయలో భారత్‌-చైనా సైనికుల ఘర్షణలతో పెచ్చుమీరిన సరిహద్దు ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య సోమవారం జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని సైన్యం ప్రకటించింది. 11 గంటల పాటు సాగిన చర్చల్లో భారత్‌ తరపున 14 కోర్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌, చైనా తరపున టిబెట్‌ మిలటరీ డిస్ట్రిక్ట్‌ మేజర్‌ జనరల్‌ లీ లిన్‌ పాల్గొన్నారు. పూర్తి సామరస్య, సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, ఇరు పక్షాల సేనలు వెనక్కితగ్గాలనే అంశంపై పరస్పర అంగీకారానికి వచ్చాయని పేర్కొంది. తూర్పు లడఖ్‌లోని సమస్యాత్మక ప్రాంతాల్లో సైన్యం వెనక్కిమళ్లేందుకు అంగీకారం కుదిరిందని, ఇరు పక్షాలు ఇదే స్ఫూర్తితో ముందు కు వెళతాయని సైన్యం పేర్కొంది. భారత్‌-చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఉద్రిక్తతలను నివారించే ఉద్దేశంతో తూర్పు లడఖ్‌లో చైనా భూభాగంలోని మోల్దో ప్రాంతంలో సోమవారం ఇరు దేశాల మధ్య లెఫ్టినెంట్‌ జనరల్‌ స్ధాయి చర్చలు జరిగిన విషయం తెలిసిందే. జూన్‌ 6న చివరిసారిగా జరిగిన ఈ చర్చల్లో సరిహద్దు ప్రాంతాల నుంచి సేనల ఉపసంహరణకు భారత్‌, చైనా అంగీకరించాయి. తొలి భేటీ అనంతరం కొద్దిరోజులకే భారత్‌, చైనా సేనల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మోల్దో చర్చలు అత్యంత కీలకమైనవిగా ఇరుసైన్యాలు ప్రకటించాయి. ఉద్రిక్తతకు దారితీసే సమస్యాత్మక ప్రాంతాల నుంచి (ఫ్రిక్షన్‌ పాయింట్స్‌) నుంచి సేనలు ఉపసంహరణ జరిగిపోతుందని తెలిపాయి. “సేనల ఉపసంహరణకు పరస్పరం ఏకాభిప్రాయం కుదిరింది. ఉపసంహరణకు సంబంధించిన విధివిధానాలపై కూడా చర్చించారు. వెంటనే ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించారు” అని సైనికవర్గాలు వెల్లడించాయి. చైనా విదేశాంగ అధికార ప్రతినిధి ఒకరు బీజింగ్‌లో మాట్లాడుతూ, సరిహద్దు పరిస్థితిని చక్కదిద్దేందుకు జరిగిన ప్రయత్నాలు సఫలీకృతమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం నలుగుతున్న సమస్యలన్నింటిపైనా ఇరుసైన్యాలు నిర్మొహమాటంగా చర్చించుకున్నాయని వెల్లడించారు. ఇదిలావుండగా, భారత ఆర్మీచీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే మంగళవారం లడఖ్‌లో రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. సరిహద్దులో సైనిక సన్నద్ధతపై ఆయన క్షేత్రస్థాయిలో చర్చలు జరుపుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?