సీనియర్‌ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు ఇకలేరు

ప్రజాపక్షం/విజయవాడ ప్రముఖ జర్నలిస్టు, రచయిత, తెలుగునాట పద్మశ్రీ అవార్డు పొందిన ఏకైక జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు సోమవారం ఉదయం విజయవాడలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌, ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎస్‌.శైలజానాథ్‌ ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఆయన మృతికి తీవ్ర సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన ప్రకటనలో, బహుముఖ ప్రజ్ఞాశాలి తుర్లపాటి గొప్ప రచయితగా వక్తగా పేరెన్నికగన్నారని పేర్కొన్నారు. తెలుగు పత్రికారంగానికి, సాహిత్యానికి ఆయన గొప్ప సేవలు అందించారని నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కుటుంబరావు తన 14వ యేటే కలం అందుకుని జర్నలిస్టుగా రాణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తొలి సిఎం టంగుటూరి ప్రకాశం పంతులుగారికి సహాయకుడిగా, ఆయన క్యాదర్శిగా ప్రశంసనీయమైన బాధ్యతలు నిర్వహించారు. పదహారేళ్ళ వయసులోనే గొప్ప వక్తగా తెలుగునాట పేరు ప్రఖ్యాతులు పొందిన కుటుంబరావు వేలాది ఉపన్యాసాలు చేశారు. ఆరున్నర దశాబ్దాలపాటు 20 వేల సభల్లో పాల్గొన్నారు. అధ్యక్షబాధ్యతలు వహించారు. ముఖ్య అతిథిగా వేల ప్రసంగాలు చేశారు. 10 వేలకుపైగా ప్రసంగాలు చేసి గొప్ప వక్తగా గిన్నిస్‌ బుక్‌ రికార్డులకెక్కారు. పత్రికారంగంలో ఉంటూ ఎన్నో గొప్ప శీర్షికలతో ప్రభంజనం సృష్టించారు. ఎన్నో పుస్తకాలు రాశారు. అక్కినేని నాగేశ్వర్రావుకు నట సామ్రాట్‌ అనే బిరుదు ఇచ్చింది ఆయనే. ‘సంచార గ్రంథలయం’గా ఆయన పేరొందారు.  ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రిక, జ్యోతిచిత్ర వీక్లీలో పనిచేశారు. ఆంధ్రజ్యోతిలో ఆయన రాసిన ‘వార్తల్లోని వ్యక్తి’ శీర్షిక ఆయనకు ఎంతో కీర్తి ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. 18 మంది ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యంగల గొప్ప జర్నలిస్టు ఆయన. ఎన్నో సందర్భాల్లో రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంత్రులకు లేఖలు రాసి వాటి పరిష్కారాలకు కృషి చేశారు. ఆయన చేసిన సేవలకుగానను 2002లో తుర్లపాటి కుటుంబరావుకు పద్మశ్రీ అవార్డు లభించింది. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ మండలి ఛైర్మన్‌గా పనిచేశారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ వారి ‘కళాప్రపూర్ణ’ సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. 1976-78లో విజయవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడుగా ఎన్నో సేవలందించారు.
ఐజెయు, ఎపియుడబ్ల్యుజె సహా పలు జర్నలిస్టు సంఘాలు ఆయన మృతికి సంతాపం ప్రకటించాయి. ఐజెయు జాతీయ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఎపియుడబ్ల్యుజె ప్రధానకార్యదర్శి చందు జనార్దన్‌, విజయవాడ ప్రెస్‌క్లబ్‌, కృష్ణా అర్బన్‌ యూనిట్‌ అధ్యక్ష కార్యదర్శులు నిమ్మరాజు చలపతిరావు, ఆర్‌.వసంత్‌, చావా రవి, కొండా రాజేశ్వరరావు, సీనియర్‌ జర్నలిస్టు షేక్‌బాబు, ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, జి.రామారావు ప్రభృతులు తుర్లపాటి కుటుంబరావు నివాసం వద్ద భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

DO YOU LIKE THIS ARTICLE?