సీనియర్ల చూపు అటువైపే

లోక్‌సభ ఎన్నికలపై కాంగ్రెస్‌ నేతల నజర్‌
జైపాల్‌రెడ్డి, జానారెడ్డి, విహెచ్‌, పొన్నాల, కోమటిరెడ్డి తదితరుల ఆసక్తి
ప్రచారంలో విజయశాంతి, రేవంత్‌, అరుణ పేర్లు
తామూ పోటీ చేస్తామంటున్న యువ నేతలు
నేడు ఢిల్లీలో రాహుల్‌తో తెలంగాణ ఎంఎల్‌ఎల కీలక సమావేశం
నెలాఖరులోగా అభ్యర్థుల ప్రకటన

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : శాసనసభ ఎన్నికల్లో పరాజయం ఎదురైనప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీలో పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడింది. ఎంపిగా పోటీ చేసేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేతలతో పాటు, ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు ఎస్‌.జైపాల్‌రెడ్డి, వి.హనుమంతరావు, కుందూరు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, విజయశాంతి తదితరులు లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నెలాఖరులోగా లోక్‌సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉండడంతో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒక దఫా ఆశావాహు ల పేర్లను పిసిసి సేకరించింది. తాజాగా లోకసభ ఎన్నికలపై కాంగ్రెస్‌ ఎంఎల్‌ఎలు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లతో మంగళవారం నాడు రాహుల్‌గాంధీ ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తరువాత త్వరలోనే గాంధీభవన్‌లో లోక్‌సభ అభ్యర్థులకు సంబంధించి నియోజవర్గాల వారీగా సమావేశం జరగనుంది. టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ కుంటియాల తో పాటు ముగ్గురు ఎఐసిసి కార్యదర్శులు, వారికి కేటాయించిన లోక్‌సభ ని యోజకవర్గాల వారీగా మూడు రోజుల పాటు వరుస సమావేశాలు నిర్వహిస్తారు.
ఖమ్మం, నల్లగొండ, భువనగిరికి పోటాపోటీ
అన్నిటికంటే ఖమ్మం, నల్లగొండ, భువనగిరి నియోజకవర్గాలకు ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ఆ నియోజకవర్గాల పరిధిలో ఎక్కువ మంది ఎంఎల్‌ఎలు ఉండడంతో పాటు, చాలా సెగ్మెంట్‌లలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్వల్ప ఓట్లతో ఓడిపోవడమే ఇందుకు కారణం. ఖమ్మం నుండి గతంలో ప్రాతినిధ్యం వహించిన రేణుకాచౌదరి, పలుసార్లు టిక్కెట్‌ ఆశించిన పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు తాజాగా వి.హనుమంతరావు కూడా ఆశావాహుల జాబితాలో చేరారు. ఇక నల్లగొండ ఎంపి స్థానం నుండి పోటీ చేస్తానని మాజీమంత్రి కోమటిరెడ్డి ఇప్పటికే ప్రకటించగా, పద్మావతి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కుందూరు జానారెడ్డిల పేర్లు కూడా పరిశీలనలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు సూర్యాపేట టిక్కెట్‌ ఆశించి పార్టీ హామీతో వెనక్కి తగ్గిన పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఆ స్థానం నుండి స్వల్ప ఓట్లతో ఓటమి పాలైన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డిలు కూడా రేసులో ఉండే అవకాశమున్నది. ఇక భువనగిరి స్థానం నుండి టిపిసిసి కోశాధాకారి గూడూరు నారాయణరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లుగా పార్టీ వర్గాలో ప్రచారం జరగుతోంది. ఇప్పటికే ఆయనకు ఎఐసిసి అధ్యక్షులు రాహుల్‌గాంధీ కూడా సంకేతాలిచ్చినట్లు తెలిసింది. అయితే, సామాజిక సమీకరణల్లో ఒకవేళ బిసిలకు ఇవ్వాలని భావిస్తే, పొన్నాల లక్ష్మయ్య, మధు యాష్కిగౌడ్‌ పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఇక ఖమ్మం, భువనగిరి స్థానాలలో ఏదో ఒక చోట నుండి ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి పేరు కూడా వినపడుతోంది. జహీరాబాద్‌ స్థానం నుండి గతంలో పోటీ చేసిన సురేశ్‌ షెట్కార్‌ ఆశిస్తున్నప్పటికీ, ఈ సారి ఆ నియోజకవర్గం పరిధిలో ఎక్కువ స్థానాలు ఉన్న కామారెడ్డి జిల్లాకు రావాలనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది. దీంతో ఆ స్థానం నుండి సీనియర్‌ నేత మహ్మద్‌ అలీ షబ్బీర్‌ పేరు తెరపైకి వచ్చింది. నాగర్‌కర్నూలు నుండి ప్రస్తుత ఎంపి నంది ఎల్లయ్యతో పాటు మల్లు రవి, సంపత్‌కుమార్‌, సతీశ్‌ మాదిగలు పోటీ చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు. అత్యధికంగా నలుగురు ఎంఎల్‌ఎలు కలిగిన మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుండి బెల్లయ్య నాయక్‌, బలరాం నాయక్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఏడు సెగ్మెంట్‌లలో కాంగ్రెస్‌ గెలిచిన నలుగురు ఎంఎల్‌ఏలలో ముగ్గురు ఆదివాసీలు కావడంతో ఆ వర్గాలలో ఒకరికి టిక్కెట్‌ ఇచ్చే అంశాన్ని కూడా కొట్టిపారేయలేమంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?