సిరీస్‌పై కన్నేసిన మిథాలీ సేన

నేడు ఇంగ్లాండ్‌తో రెండో వన్డే
ఐసిసి మహిళల వన్డే చాంపియన్‌షిప్‌
ముంబయి: పర్యటక ఇంగ్లాండ్‌ను తొలి వన్డేలో చిత్తు చేసిన మిథాలీ సేన ఇక సరీస్‌పై కన్నేసింది. సోమవారం జరిగే రెండో వన్డేలోనూ ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. నేడు భారత్‌ జట్ల మధ్య ఉదయం 9. గంటల నుంచి రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంకానుంది. తొలి మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌ఉమెన్స్‌ తడబడినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు గొప్ప విజయాన్ని అందించారు. ముఖ్యంగా స్పిన్నర్‌ ఏక్తా బిష్త్‌ నాలుగు వికెట్లతో చెలరేగి విజయంతో కీలక పాత్ర పోషించింది. బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధనా, జెమీమా రొడ్రిగ్స్‌ 69 పరుగులు జోడించి శుభారంభాన్ని అందించినా.. తర్వాతి బ్యాట్స్‌ఉమెన్స్‌ రాణించకపోవడంతో భారత్‌ 202 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈమ్యాచ్‌లో కుదురుగా ఆడిన మంధనా 42 బంతుల్లో 3 ఫోర్లతో 24 పరుగులు మాత్రమే చేసింది. మరో యువ ఓపెనర్‌ జెమీమా మాత్రం ధాటిగా ఆడి 58 బంతుల్లో 8 ఫోర్ల సహయంతో 48 పరుగులు సాధించి తృటిలో హాఫ్‌ సెంచరీ మిస్‌ చేసుకుంది. తర్వాత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (74 బంతుల్లో 44) పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచింది. చివర్లో వికెట్‌ కీపర్‌ తానియ భాటియా (25) సమన్వయంతో ఆడినా.. ఝులన్‌ గోస్వామి మాత్రం చెలరేగి ఆడింది. ఝులన్‌ 37 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30 పరుగులు చేయడంతో భారత్‌ 200 పరుగుల మార్కును దాటగలిగింది. ఇక దీప్తి శర్మ (7), హర్లీన్‌ డియోల్‌ (2), మెష్రమ్‌ (0) ఘోరంగా విఫలమయ్యారు. తర్వాత స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పటిష్ట ఇంగ్లాండ్‌ను భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్‌తో ముప్పతిప్పలు పట్టించారు. ఆరంభంలోనే ఓపెనర్‌ ఆమీ జోన్స్‌ (1)ను శిఖా పాండే పెవలియన్‌ పంపింది. తర్వాత టామి బియోమంట్‌ (18)ను దీప్తి శర్మ, కీపర్‌ సారా (10)ను శిఖా పాండేలను వెనువెవంటనే ఆవుట్‌ చేసి ఇంగ్లాండ్‌కు కష్టాల్లో నెట్టారు. తర్వాత కెప్టెన్‌ హేదర్‌ నైట్‌ (39 నాటౌట్‌), నటాలి స్కైవర్‌ (44) రాణించిన తమ జట్టును గెలిపించలేక పోయారు. భారత బౌలర్‌ ఏక్త బిష్త్‌ అద్భుతమైన స్పిన్‌తో ఇంగ్లాండ్‌ జట్టును తిప్పేసింది. ఇమే ధాటికి ఇంగ్లాండ్‌ జట్టు 136 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్‌కు 66 పరుగుల భారీ విజయం దక్కింది. తక్కువ స్కోరును సైతం కాపాడుకున్న టీమిండియా బౌలర్లు అందరి ప్రశంసలు పొందారు. ఇక ఈరోజు జరగనున్న రెండో వన్డేలోనూ భారత బౌలర్లు తమ జోరును కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నారు. సీనియర్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి గత మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. చివరి సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఝులన్‌ తన బ్యాట్‌ను ఝుళిపించడంతో టీమిండియా పోరాడగలిగే స్కోరును ప్రత్యర్థి ముందు ఉంచగలిగింది. ఇక ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌ స్మృతి మంధనా చెలరేగితే భారత్‌ భారీ స్కోరు సాధించడం ఖాయం. మరోవైపు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ, మిడిల్‌ ఆర్డర్‌, లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌ఉమెన్స్‌ రాణించాల్సిన అవసరం ఉంది. పటిష్టమైన ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే మిథాలీ సేన కలిసికట్టుగా ఆడాల్సిందే. అందరూ కలిసి రాణిస్తే ఈ రెండో వన్డేలోనే భారత్‌కు సిరీస్‌ దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇక ఇంగ్లాండ్‌ జట్టు ప్రతీకార రెచ్చతో రగిలిపోతుంది. తొలి వన్డేలో ఘోర ఓటమికి ప్రతీకారంగా టీమిండియాపై ఎలాగైన గెలవాలని భావిస్తోంది. తొలి వన్డేలో బౌలర్లు రాణించినా.. బ్యాట్స్‌ఉమెన్స్‌ తడబాటు ఇంగ్లాండ్‌ ఓటమికి ప్రధాన కారణమైంది. రెండో వన్డేలో తమ బ్యాట్స్‌ఉమెన్స్‌ సత్తా చాటుతారని ఇంగ్లాండ్‌ సారథి హేదర్‌ నైట్‌ ధీమా వ్యక్తం చేసింది. ఈ కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడడం ఖాయంగా కనిపిస్తోంది.

DO YOU LIKE THIS ARTICLE?