సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ నాగేశ్వరరావుకు సుప్రీం అసాధారణ శిక్ష

కోర్డు ధిక్కరణ కింద లక్ష రూపాయల జరిమానా
సాయంత్రం వరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశం

న్యూఢిల్లీ: ముజఫర్‌పూర్‌ వసతిగృహ అత్యాచారాల కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న ఎస్‌కె శర్మను బదిలీ చేసి సిబిఐ మాజీ తాత్కాలిక డైరెక్టర్‌ ఎం. నాగేశ్వరరావు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు అత్యున్నత న్యాయస్థానం నిర్ధారించింది. ఇందుకు గానూ నాగేశ్వర రావుకు, సిబిఐ న్యాయ సలహాదారు ఎస్‌ భసురాంకు న్యాయస్థానం అసాధారణ శిక్ష విధించింది. రూ. లక్ష జరిమానాతో పాటు మంగళవారం కోర్టు కార్యకలాపాలు ముగిసేంతవరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని ఆదేశించింది. వారు కావాలనే కోర్టుపట్ల అవిధేయతతో ప్రవర్తించారని భావించింది. కోర్టు ముగియక ముందే వారు వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు మందలించింది. ముజఫర్‌పూర్‌ అత్యాచారాల కేసు దర్యాప్తు నుంచి అధికారులను బదిలీ చేయవద్దని సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. అయితే ఈ ఆదేశాలను పక్కనబెట్టి నాగేశ్వరరావు తాను తాత్కాలిక డైరెక్టర్‌గా ఉన్న సమయంలో ఎస్‌కె శర్మను దర్యాప్తు నుంచి తప్పించారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగేశ్వరరావుకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి నాగేశ్వరరావు మంగళవారం కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆయన తరఫున అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. నాగేశ్వరరావు ఉద్దేశపూర్వకంగా చేయలేదని, అయితే ఇందుకు ఆయన ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినట్లు కెకె వేణుగోపాల్‌ న్యాయస్థానానికి విన్నవించారు. అయితే దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ఎల్‌ఎన్‌ రావు, సంజీవ్‌ ఖన్నాలతో ఉన్న ధర్మాసనం ‘ఇంతకు మించి మేము ఏమి చేయలేము’ అని పేర్కొంది. కోర్టు ధిక్కరణపై నాగేశ్వర రావు, భసురాంలను విచారించిన ధర్మాసనం వారికి కోర్టు ముగిసే వరకు కోర్టు రూంలోనే కూర్చోవాలని శిక్ష విధించింది.

DO YOU LIKE THIS ARTICLE?