సిబిఎస్‌ఇ పరీక్షలు రద్దు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో 10, 12 తరగతులకు సంబంధించిన పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) సుప్రీంకోర్టుకు తెలిపింది. గురువారం సిబిఎస్‌ఇ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జులై 1 నుంచి 15 మధ్య జరగాల్సిన సిబిఎస్‌ఇ 12వ తరగతి, 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు ఐసిఎస్‌ఇ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్ని వివరాలను సుప్రీంకోర్టుకు వివరించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించలేమని చెప్పాయని, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామన్నాయని తుషార్‌ మెహతా తెలిపారు. 12వ తరగతి విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఇచ్చారు. పరీక్షకు హాజరవ్వాలా? లేక ఇంటర్నల్‌ మార్కుల ద్వారా సర్టిఫికెట్‌ తీసుకోవాలో అనే నిర్ణయాధికారాన్ని విద్యార్థులకు ఇచ్చినట్లు సిబిఎస్‌ఇ కోర్టుకు వివరించింది. ఆ ఫలితాలను జులై 15న వెల్లడిస్తామని తుషార్‌ మెహతా పేర్కొన్నారు. ఇక సిబిఎస్‌ఇ పరీక్షలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని.. ఈనెల 25లోగా నోటిఫికేషన్‌గా విడుదల చేస్తామని న్యాయస్థానానికి కేంద్రం తెలిపింది. పరీక్షల నిర్వహణపై పూర్తి సమాచారంతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

DO YOU LIKE THIS ARTICLE?