సిపిఐ పోడు యాత్ర

ఆగస్టు 4 నుంచి 8 వరకు చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటన
ఈ నెల 27, 28 తేదీల్లో సిపిఐ ప్రతినిధి బృందం కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టుల సందర్శన
ప్రజాపక్షం / హైదరాబాద్‌ పోడు భూముల సాగుదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అటవీ అధికారులు, పోలీసుల వేధింపులకు నిరసనగా ఆగస్టు 4 నుండి 8వ తేదీ వరకు బాసర నుండి భద్రాచలం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ‘పోడు యాత్ర’ చేయనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఈ యాత్రలో తనతో పాటు సిపిఐ రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. జల వివాదాల నేపథ్యంలో కృష్ణా జలాల ఆధారిత ప్రాజెక్టులను సిపిఐ ప్రతినిధి బృందం ఈ నెల 27, 28 తేదీల లో సందర్శించనున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో ప్రజల అవసరాలు, ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను వేలం వేయడా న్ని ఆయన తప్పుబట్టారు. అన్యాక్రాంతమైన ప్రభు త్వ, దేవాదాయ, భూదాన, వక్ఫ్‌ భూములను నాలుగైదు రోజుల్లో గుర్తించి పేదలకు పంచేందుకు ప్రభుత్వానికి సమాచారమిస్తామని, లేదంటే భూపోరాటం చేసి తామే పంపిణీ చేస్తామన్నారు. మంగళవారం జరిగిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, ఎన్‌.బాలమల్లేశ్‌లతో కలిసి మఖ్దూంభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యదర్శివర్గ సమావేశ నిర్ణయాలను చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. 2018 ముందస్తు ఎన్నికలకు ముందు స్వయం గా సిఎం కెసిఆర్‌ తానే ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి కుర్చీ వేసుకుని కూర్చొని పోడు సాగుదారులకు పట్టాలిప్పిస్తానని చేసిన వాగ్దానం ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు. ప్రతిసారి పోడు సాగు ప్రారంభించే, పంట చేతికొచ్చే సమయంలో పోడుసాగుదారులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడం సర్వసాధారణమైందని తెలిపారు. ఇందులో గిరిజనులు, బడు గు, బలహీనవర్గాలు తీవ్ర ఇబ్బందులకు, గాయాలకు గురవుతున్నారని చెప్పారు. పోడు సాగుదారులు, కుటుంబసభ్యులపై పోలీసులు క్రిమినల్‌ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలుపుకోవాలని, అటవీ అధికారులు, పోలీసుల వేధింపులు నిలిపివేయాలని, పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌లతో ‘పోడు యాత్ర’ తలపెట్టినట్లు ఆయన తెలిపారు.
నదీ జలాలపై న్యాయ, రాజకీయ పోరాటం చేయాలి
ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని ఆసరాగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డులకే ఎపి, తెలంగాణ ప్రాజెక్టులు, విద్యుత్‌ ఉత్పత్తిపై పెత్తనం ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడిందని చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. గడిచిన ఏడేళ్ళుగా కృష్ణానదిపై చివరి దశలో ఉన్న ఎస్‌ఎల్‌బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌ వంటి ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల వంటి కొత్త ప్రాజెక్టులను కెసిఆర్‌ ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో అవి ప్రశ్నార్థకంగా మారాయన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు రావడం, బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ రెండవసారి తుది తీర్పు ఇవ్వకపోవడంతో కృష్ణా జలాలకు సంబంధించి గందరగోళం ఏర్పడిందన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోకపోవడంతో అదును కోసం చూసిన కేంద్ర ప్రభుత్వం… బోర్డుల పరిధుల పేరుతో ప్రాజెక్టులపై పెత్తనం తీసుకున్నదని తెలిపారు. చివరకు గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం నిర్వహణను కూడా బోర్డుల ఆధీనంలోకి చేర్చడం దారుణమని, ఇదంతా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నదీ జలాల సమస్యపై సిఎం కెసిఆర్‌ అఖిలపక్షాలను కలుపుకొని పోరాటాలు చేయాలని, ఇందుకు న్యాయపోరాటంతో పాటు, కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చేలా ఉద్యమించాలని చాడ వెంకట్‌ రెడ్డి సూచించారు.
ప్రాజెక్టుల సందర్శన: కృష్ణా జలాల ఆధారిత జిల్లాలలో ప్రాజెక్టులను సందర్శించి క్షేత్ర స్థాయి వాస్తవాలను తెలుసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గం నిర్ణయించిందని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతలో జులై 27న మహబూబ్‌నగర్‌ జిల్లా, 28న నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టులను తనతో పాటు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకట్‌రెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, బాల నర్సింహా, బాగం హేమంతరావులు సందర్శిస్తామన్నారు.
నెలాఖరులో హుజూరాబాద్‌ సమావేశం : హుజూరాబాద్‌ ఉప ఎన్నిక విషయంలో చర్చించేందుకు ఈ నెలాఖరులో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో సిపిఐ, సానుభూతి పరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

సిపిఐ రాష్ట్రకార్యదర్శివర్గం తీసుకున్న ఇతర నిర్ణయాలు:
* తక్షణమే గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ.లక్ష రుణ మాఫీ, వడ్డీ మాఫీలను అమలు చేయాలని ఈనెల 22న రైతుసంఘం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు సంపూర్ణ మద్దతు.
* ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీల కార్పొరేటీకరణ, అత్యవసర రక్షణ సేవల ఆర్డినెన్స్‌ ఉపసంహరణకు వ్యతిరకంగా ఈనెల 23న ఎఐటియుసి నిరసనలకు మద్దతు.
* ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో వ్యవసాయ, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని ఎఐటియుసి, ఇతర కార్మిక సంఘాల నిరసన కార్యక్రమానికి మద్దతు.
* ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం ఆగస్టు 9 నుండి 18 వరకు ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాలు నిర్వహించే సదస్సులకు సంఫీుభావం.

DO YOU LIKE THIS ARTICLE?