సిఎఎను వెనక్కి తీసుకోండి

కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కెసిఆర్‌ డిమాండ్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), నేషనల్‌ పాపులేషన్‌ రికార్డ్‌( ఎన్‌పిఆర్‌), నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజన్స్‌ (ఎన్‌ఆర్‌సి) కేవలం ముస్లింల సమస్య కాదని, ఇది దేశ సమస్య అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశానికి ఇలాంటి చట్టం అవసరం లేదని, దీనిని వెనక్కి తీసుకునేందుకు పునఃపరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు, పాకిస్తాన్‌ ఏజెంట్‌ అనడం మంచిది కాదన్నారు. సిఎఎ పేరుతో దేశంలో విభజన రాజకీయాలు అవసరామా అని సూటిగా ప్రశ్నించారు. రాక్షసానందం పొం దుతూ పౌర చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ‘ సిఎఎ, ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి’లను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభలో సిఎం కెసిఆర్‌ సోమవారం తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. సిఎఎను తాము గుడ్డిగా వ్యతిరేకించడం లేదని, అన్నీ అర్థం చేసుకున్న తర్వాతనే దీనిని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సిఎఎ అమలు తప్ప దేశంలో వేరే సమస్యే లేదన్నట్టు, ఏదో కొంపలు మునిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారిస్తోందని, సంకుచితంగా, ఇరుకుగా ఆలోచిస్తోందని విమర్శించారు. ఇ లాంటి చట్టాల ద్వారా భారతదేశ ప్రతిష్ట, గౌరవం గంగలో కలుస్తుందన్నారు. పార్లమెంట్‌లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలో ఎన్‌ఆర్‌సికి ఎన్‌పిఆర్‌ తొలిమెట్టు అని స్పష్టంగా ఉన్నదని, మరో వైపు ఎన్‌ఆర్‌సిని అమలు చేయబోమని సాక్షాత్తు కేంద్ర హోం శాఖ మంత్రి ప్రకటించారని, ఇలా పరస్పర భిన్నమైన అంశాలు ఉన్నాయని, ఇందులో ఏది కరెక్ట్‌ అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కెసిఆర్‌ ప్రశ్నించారు. పౌరసత్వంపై ఇలాంటి ద్వం ద్వ వైఖరి ఎందుకని, ఏదైనా బాజాప్త చె ప్పాలని, సిఎఎలో ముస్లింలను మినహాయించడం ఎలా సాధ్యమని, ఇది రాజ్యంగ విరుద్ధమన్నారు. అందుకే సిఎఎపై కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేదన్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టాలో వారి కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు. పౌరులకు జాతీయత గుర్తింపు కార్డు ఇస్తే తాము మద్దతునిస్తామని, కానీ అందుకు ఇతర మార్గంలో ఇతర ఫార్మూలతో ముందుకు రావాలన్నారు. దేశంలో ఇప్పటికే కేరళ, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, రాజస్తాన్‌, ఛత్తీస్‌గడ్‌,ఢిల్లీ,మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేశాయని, తెలంగాణ ఎనిమిదో రాష్ట్రమని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయని, సా క్షాత్తు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్‌ ట్రంప్‌ వచ్చినప్పుడే దేశ రాజధానిలో 50 మంది చనిపోయారని,లౌకిక, ప్రజాస్వామ్యవాదులు తమ తమ పద్ధతుల్లో నిరసనలు తెలుపుతున్నారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?