సిఎఎకు నో

ప్రజాపక్షం/హైదరాబాద్‌: పౌరసత్వ చట్టం(సిఎఎ)లో మతం లేదా విదేశాలకు సంబంధించిన అన్ని అంశాలను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాలని తెలంగాణ శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ప్రతిపాదిత ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి అమలు ద్వారా పెద్ద ప్రజలను మినహాయించే అవకాశమున్నదని ఉభయ సభలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి వంటి చర్యల నుండి రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు సోమవారం శాసనసభ సమావేశంలో స్వయంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చను ప్రారంభించారు. తీర్మానానికి టిఆర్‌ఎస్‌,ఎంఐఎం, కాంగ్రెస్‌ పార్టీలు సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. చర్చలో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌ ఓవైసి, సిఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, ప్రభుత్వ విప్‌ బాల్కసుమన్‌, టిఆర్‌ఎస్‌ సభ్యులు మహ్మద్‌ షకీల్‌, బిజెపి సభ్యులు టి.రాజాసింగ్‌ పాల్గొన్నారు. అనంతరం మూజువాణి ఓటు తీసుకొని తీర్మానాన్ని సభ ఆమోదించినట్లుగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్‌ సభ్యులు టి.జీవన్‌రెడ్డి, ఎంఐఎం సభ్యులు అమిన్‌ఉల్‌ హసన్‌ జాఫ్రీ,టిఆర్‌ఎస్‌ సభ్యులు కర్నె ప్రభాకర్‌,ఫారూఖ్‌ హుసేన్‌, ఎం.ఎస్‌.ప్రభాకర్‌, మహ్మద్‌ ఫరీదుద్దీన్‌, సభ్యులు అలుగుబెల్లి సభ్యులు నర్సిరెడ్డి పాల్గొని తీర్మానానికి మద్దతు ప్రకటించారు. శాసనసభలో బిజెపి ఎంఎల్‌ఏ రాజాసింగ్‌, మండలిలో బిజెపి ఎంఎల్‌సి బిజెపి సభ్యులు ఎన్‌.రాంచందర్‌రావు మినహా మిగతా సభ్యులంతా ఏకోన్ముఖంగా తీర్మానానికి మద్దతు పలికారు.

DO YOU LIKE THIS ARTICLE?