సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంపు

ప్రజాపక్షం / హైదరాబాద్‌ సింగరేణి కార్మికుల ఉద్యోగ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు నిర్ణయించారు. ఈనెల 26 తేదీన జరిగే బోర్డు మీటింగ్‌లో అమలు తేదీని నిర్ణయించి ప్రకటించాలని సింగరేణి ఎండి శ్రీధర్‌ను ఆయన ఆదేశించారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, కోల్‌ బెల్ట్‌ ఏరియా ఎంఎల్‌ఎల అభ్యర్థన మేరకు పదవీ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని సిఎం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రతికా ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ద్వారా మొత్తం 43,899 మంది సింగరేణి కార్మికులు అధికారులకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపింది.
రామగుండంలో మెడికల్‌ కాలేజీ
రామగుండం నియోజకవర్గ కేంద్రంలో సింగరేణి మెడికల్‌ కాలేజీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్‌ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలో ఆదేశాలు వెలువడనున్నాయి. సింగరేణి ప్రాంత సమస్యలు- పరిష్కారాలు అంశం పై ఆ ప్రాంత పరిధిలోని ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ విప్‌, చెన్నూరు ఎంఎల్‌ఎ బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌ మణుగూరు ఎంఎల్‌ఎ రేగా కాంతారావు, మంచిర్యాల ఎంఎల్‌ఎ దివాకర్‌ రావు, భూపాల్‌పెల్లి ఎంఎల్‌ఎ గండ్ర వెంకట రమణారెడ్డి, కొత్తగూడెం ఎంఎల్‌ఎ వనమా వెంకటేశ్వర్‌ రావు, రామగుండం ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్‌, ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎ ఆంత్రం సక్కు, సిర్పూర్‌ ఖాగజ్‌ నగర్‌ ఎంఎల్‌ఎ కోనేరు కోనప్ప , తదితరులు పాల్గొన్నారు

 

DO YOU LIKE THIS ARTICLE?