సింగరేణిలో గుర్తింపు ఎన్నికలెప్పుడో?

తాత్సారం చేస్తున్న ప్రభుత్వం
హక్కులు కోల్పోతున్న కార్మికులు
అధికార పార్టీని భయపెడుతున్న గుర్తింపు సంఘ వైఫల్యం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. గుర్తింపు సంఘ పదవీ కాలం ముగిసి రెండేళ్లు కావస్తున్నా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం జంకుతున్నది. గత ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మిక ప్రయోజనాలను తాకట్టుపెట్టడంతో పాటు నేతల స్వప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు గుర్తింపు సంఘ ఎన్నికలకు పోతే ఓటమి తప్పదన్న ప్రచారం జరుగుతున్నది. ఎన్నికలు లేని కారణంగా కార్మికులు హక్కులు కోల్పోతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం త్వరితగతిన గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించాలని కార్మికులు కోరుతున్నారు. ఎన్నికల కోసం కార్మిక సంఘాలు పోరుబాట పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అతి పెద్ద సంస్థగా సింగరేణికి గుర్తింపు ఉంది. ఇప్పటికీ సింగరేణి సంస్థలో 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పని చేస్తుండగా రెండు వేల మంది అధికారులు పనిచేస్తున్నారు. వీరితో పాటు 25 వేల మంది కాంట్రాక్ట్‌ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు. మొత్తం 19 ఉపరితల (ఓపెన్‌ కాస్ట) గనులు, 26 భూగర్భ (అండర్‌ గ్రౌండ్‌) గనుల ద్వారా సింగరేని సంస్థ బొగ్గును ఉత్పత్తి చేస్తున్నది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా ఉన్న సింగరేణి గనుల్లో పనిచేస్తున్న కార్మిక హక్కుల సాధనకు, పరిరక్షణకు కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి. 2017 అక్టోబరు 5న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘ ఎన్నికలు జరగగా తిరిగి 2019లో ఎన్నికలు జరగవలసి ఉంది. గుర్తింపు సంఘ ఎన్నికల్లో గెలుపొందిన కార్మిక సంఘం సమస్యలపై యజమాన్యంతో చర్చించేందుకు రెండేళ్ల పదవీ కాలం ఉంటుంది. గుర్తింపు ఇవ్వడంలో ఆలస్యం కావడంతో 2019 ఫిబ్రవరి నుంచి పదవీ కాలాన్ని లెక్కిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ యూనియన్‌ గుర్తింపు కాలం ముగిసి ఐదారు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. గత ఎన్నికల్లో గెలిచిన టిఆర్‌ఎస్‌ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్మికుల సమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైందని విమర్శలు ఉన్నాయి. కార్మికుల ప్రయోజనాల కంటే నేతల వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యత నిచ్చారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కార్మిక హక్కులను ప్రభుత్వ వత్తాసుతో యజమాన్యానికి తాకట్టు పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిస్థితే సింగరేణిలో నెలకొందని ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని కార్మికులు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సింగరేణిలో కార్మికుల సంఖ్య పెరగడంతో పాటు రాష్ట్రంలో బొందల గడ్డలను చేస్తున్న ఉపరితల గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని నిలిపి వేస్తామని చెప్పిన టిఆర్‌ఎస్‌ ఇప్పుడు ఉపరితల గనుల సంఖ్యను క్రమేపి పెంచుతూ వస్తున్నది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి కంటే ఇప్పుడు సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కార్మికుల హక్కులు క్రమేపి హరించబడడంతో పాటు సింగరేణి ప్రభుత్వ జేబు సంస్థగా మారిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నిధుల మళ్లింపు జరుగుతుందని, బోనస్‌ పంపిణీలోనూ కార్మికులకు ఇతర ఆర్థిక వెసులుబాటు కల్పించడంలోనూ సింగరేణి విఫలమైందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గుర్తింపు సంఘం వైఫల్యం చివరకు కార్మికుల హక్కుల ఉనికికే ప్రమాదం తీసుకువస్తుందని సింగరేణిలో ప్రధాన సంఘమైన ఎఐటియుసి అనుబంధ సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆరోపిస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా సింగరేణిలో గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహించి కార్మిక హక్కుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?