సర్జికల్‌ దాడికి సంకేతాలు!

కశ్మీర్‌ సరిహద్దులో టెర్రరిస్టుల ఏరివేతకు పక్కా ప్లాన్‌?
సైనిక బలగాల సంసిద్ధత కోసం నిరీక్షణ

న్యూఢిల్లీ : పుల్వామా కిరాతక దాడి నేపథ్యంలో టెర్రరిస్టులపై సర్జికల్‌ దాడులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లుగా సంకేతాలు కన్పిస్తున్నాయి. అవసరాన్ని బట్టి ఉపయోగపడేలా త్రివిధ దళాలు ఎ లాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధం గా వున్నట్లు కేంద్ర సర్కారుకు తెలియజేసినట్లు సమాచారం. ఇప్పటికే పాకిస్థాన్‌ సరిహద్దులో ఉగ్రవాదులను గానీ, పాక్‌తో ఎ లాంటి యుద్ధానికైనా తాము సిద్ధంగా వున్న ట్లు వైమానిక దళాధిపతి బిఎస్‌ ధనోవా ప్రకటించారు. కశ్మీర్‌ సరిహద్దులోని అన్ని సెక్టార్లలోనూ సైనిక బలగాలు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే ప్రతీకారం తీర్చుకుంటామని పదేపదే ప్రకటించారు. పుల్వామాలో సైనిక వాహనాలపై టెర్రరిస్టులు జరిపిన ఆత్మాహుతిదాడిలో 40 మంది జవాన్లు అమరులైన విషయం విదితమే. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ప్రజలను కలచివేసింది. పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు రగులుకున్నాయి. అమరజవాన్లకు నివాళులర్పిస్తూ శాంతి ప్రదర్శనలు జరిగాయి. దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లోనూ ఈ తరహా ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సర్జికల్‌ దాడి అనివార్యంగా ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నా, ఇలాంటి దాడి ఒకటి తమ పార్టీకి అవసరమని కూడా బిజెపి నేతలు భావిస్తున్నారు.మోడీ, రాజ్‌నాథ్‌లతోపాటు కేంద్రమంత్రులంతా గడిచిన నాలుగు రోజులుగా పాకిస్థాన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. పాకిస్థాన్‌పై భారత్‌ చర్యలను కూడా ఇప్పటికే ప్రారంభించింది. పాక్‌ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై దిగుమతి సుంకాన్ని 200 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం వీలైనంత మేరకు పాక్‌ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నది. ఇరాన్‌ వంటి ముస్లిమ్‌ దేశాలు కూడా పుల్వామా ఘటనను ఖండించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉగ్రవాద శిబిరాలను పేల్చివేయడానికి ఏదో ఒక చర్యతో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని కేంద్రం భావిస్తోంది. వైమానిక దళం నుంచి సంసిద్ధత వ్యక్తమైనప్పటికీ, సైనిక, నావికాదళాధిపతి నుంచి సంకేతాల కోసం కేంద్రం ఎదురుచూస్తున్నట్లుగా తెలిసింది. కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సన్నాహకంగానే కీలకమైన వేర్పాటువాదులకు భద్రతను కేంద్ర ఆదేశాల మేరకు కశ్మీర్‌లో ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. భద్రత ఉపసంహరించిన వేర్పాటువాద నేతల్లో మిర్వాజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌, అబ్దుల్‌ ఘనీ, బిలాల్‌లోనే, హషీమ్‌ ఖురేషీ, ఫజల్‌ హక్‌ ఖురేషీ, షబ్బీర్‌షాలు వున్నారు. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలకు జమ్మూకశ్మీర్‌లోని కొన్ని శక్తులు సహకరిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోంది. కశ్మీర్‌లో ప్రస్తుతం గవర్నర్‌ పాలన కొనసాగుతుండటం, లోక్‌సభ ఎన్నికలకు కేవలం రెండు మాసాల సమయం మాత్రమే వుండటం, దేశవ్యాప్తంగా పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబికడం వంటి అంశాలను మోడీ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే ఎన్‌డిఎకు వ్యతిరేకత విపరీతంగా వుండటంతో దాన్ని తగ్గించుకోవడానికి సర్జికల్‌ స్ట్రయిక్‌ ఒకటి అవసరమని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నారు. కేంద్రం ఊహించినట్లుగా అన్నీ జరిగితే, రెండు మూడు రోజుల్లో కశ్మీర్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా బలమైన సర్జికల్‌ దాడి జరిగే అవకాశాలు వున్నాయని అభిజ్ఞవర్గాలు చెపుతున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?