సరిహద్దులు కట్టుదిట్టం

హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు
అధికారులను ఆదేశించిన సిఎం కెసిఆర్‌
ప్రజాపక్షం / హైదరాబాద్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు పాటించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌ నగరంతో పాటు కర్నూలు సరిహద్దు గ్రామాల్లో, గుంటూరు జిల్లా సరిహద్దులు గల గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ, లాక్‌డౌన్‌ అమలు, సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ ప్రగతిభవన్‌లో బుధవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్య శాఖమంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌, డిజిపి మహేందర్‌రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, ముఖ్య కార్యదర్శులు ఎస్‌ నర్సింగ్‌ రావు, రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చాలా తక్కువగా ఉందని, కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోనే ఉన్నాయని సిఎం చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు హైదరాబాద్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని, ఎవరికి వ్యాధి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు జరిపి అవసరమైతే చికిత్స చేయించాలన్నారు. ఎవరు పాజిటివ్‌గా తేలినా అతను కలిసిన వారందరినీ క్వారంటైన్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌లోని వారు బయటకు పోకుండా, బయటివారు హైదరాబాద్‌ లోపలికి రాకుండా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టాలన్నారు. చురుకైన పోలీసు అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఐఎఎస్‌ అధికారులను ప్రత్యేకాధికారులుగా నియియమిచాలన్నారు. మొత్తం హైదరాబాద్‌ను చుట్టుముట్టాలని, వైరస్‌ను తుదముట్టించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పక్క రాష్ట్రంలోని కర్నూలు పట్టణం, గుంటూరు జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, వాటికి సరిహద్దుల్లోనే తెలంగాణ గ్రామాలున్నాయని, ఈ రెండు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించి నియంత్రణ చర్యలు చేపట్టాలని సిం అధికారులను ఆదేశించారు. అక్కడి వారు ఎవరూ ఇక్కడికి రాకుండా, ఇక్కడి వారు అక్కడకు వెళ్లకుండా నియంత్రించాలన్నారు. వైరస్‌ మన దగ్గర పుట్టింది కాదని, ఇతర ప్రాంతాల నుంచి వ్యాప్తి చెందేదేనని, ప్రజల రాకపోకలను ఎంత కట్టుదిట్టంగా నియంత్రించగలిగితే వైరస్‌ వ్యాప్తిని అంత బాగా అరికట్టవచ్చని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?