సమన్వయం పేరుతో సగం దోపిడీ

నిలువునా దగా పడుతున్న ఏజెన్సీ రైతు
బహుళ జాతి సంస్థల పేరుతో ఎర
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో : రైతుల కష్టం అనాదిగా దోపిడీదారుల పాలవుతూనే ఉంది. ఏజెన్సీ రైతుల పరిస్థితి మరీ దయనీయం. తెలంగాణ విత్తన భాండాగారమన్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన బహుళ జాతి సం స్థలు, బ్రోకర్లు, సమన్వయ కర్తల పేరు తో దోపిడీకి పాల్పడుతున్నాయి. చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, వెంకటాపురం మండలాల్లోని వాతావరణ విత్తనోత్పత్తికి పూర్తి అనుకూలంగా ఉంటుంది. దశాబ్ద కాలానికి పైగా బహుళ జాతి సంస్థలు ఈ ప్రాంతంపై కన్నువేశాయి. వరి, మొక్కజొన్న, మిర్చి విత్తనోత్పత్తి కొరకు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఏ బహుళ జాతి కంపెనీ కూడా రైతులతో నేరుగా ఒప్పందం కుదుర్చుకోదు. సమన్వయ కర్తల (బ్రోకర్ల)తో అంతా లాభం కంపెనీలు తీసుకుంటే మిగిలినది సమన్వయ కర్తలు దోచుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… విత్తన సాగుకు అనుకూలంగా ఈ మండలంలో వరి, మొక్కజొన్న, మిర్చి విత్తన సంస్థలు సమన్వయ కర్తల ద్వారా రైతులకు ఒప్పందం కుదుర్చుకుంటుంది. రైతులు సంస్థలు చెప్పిన యాజమాన్య పద్ధతులను మాత్రమే పాటించాలి. సంస్థలు ఇచ్చిన హామీ మేరకు దిగుబడి రాకపోతే రైతులకు విత్తన సంస్థలు పరిహారం చెల్లిస్తాయి. ఇంత వరకు బాగానే ఉన్నా సమన్వయ కర్తలు, పురుగుమందులు, ఎరువుల దుకాణాలు తెరిచి విత్తన సంస్థల పేరుతో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మార్కెట్‌ ధర కంటే ఒక్కో రసాయన ఎరువు బస్తాపై రూ. 300, పురుగు మందులపై రూ. 500 బయట మార్కెట్‌ కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. సంస్థలు రైతులకు ఇచ్చే పెట్టుబడిని సమన్వయ కర్తలు తమ సొమ్ముగా రైతులకు అధిక వడ్డీలకు ఇస్తారు. యాజమాన్య పద్ధతులను సక్రమంగా పాటించినా దిగుబడి తగ్గితే వచ్చే పరిహారాన్ని సమన్వయ కర్తలే కాజేస్తున్నారు. ఒక్కో సమన్వయ కర్త ఏడాదికి కోట్లలో వెనకేసుకుంటున్నారు. మిర్చికి సంబంధించి రైతు పండించిన దానిలో పర్సంటేజీలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు విత్తనోత్పత్తి సాగు లాభదాయకంగా ఉండగా ఇప్పుడు దళారులు బ్రోకర్ల పుణ్యమా అని శ్రమ విలువ కూడా దక్కడం లేదు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో బెదిరింపులు, దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు వారు ఏమి చెబితే అదే చేస్తున్నారు. సమన్వయ కర్తల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీ మొత్తం అధికార యంత్రాంగానికి తెలిసినా మౌనం వహించడం పలు ఆరోపణలకు దారితీస్తుంది. విత్తన భాండాగారంగా ఉన్న ఈ ప్రాంత రైతాంగాన్ని దోపిడీ నుంచి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రభుత్వం నేరుగా విత్తనోత్పత్తి రంగంలోకి దిగి రైతుల ద్వారా సాగు చేయిస్తే నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి కావడంతో పాటు రైతులకు మేలు జరుగుతుంది.

DO YOU LIKE THIS ARTICLE?