సన్‌రైజర్స్‌కు చావోరేవో

నేడు రాజస్థాన్‌ రాయల్స్‌తో కీలక పోరు
రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం

జైపూర్‌ : ఐపిఎల్‌ సీజన్‌ లీగ్‌ దశ పోటీలు దాదాపు ముగియడానికి వచ్చేశాయి. కానీ ఇప్పటి వరకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మినహా మిగతా జట్లన్ని ప్లే ఆఫ్‌ కోసం ఇంకా తీవ్రంగా పోటీ పుడుతునే ఉన్నాయి. సూపర్‌ కింగ్స్‌ 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 14 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ జట్టు కూడా మరో మ్యాచ్‌ గెలిస్తే ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తోంది. కానీ ఇతర జట్లు మాత్రం ఇంకా తీవ్రంగా శ్రమిస్తునే ఉన్నాయి. కొన్ని జట్లు ముందు మంచి ఆటను ప్రదర్శించిన లీగ్‌ చివర్లో వరుస ఓటములతో సతమతమవుతున్నాయి. మరికొన్ని జట్లు ఆరంభంలో పేలవమైన ఆటతో నిరాశ పరిచిన చివర్లో మాత్రం అనూహ్యంగా పుంజుకోని రేసులో నిలుచున్నాయి. ఇక సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు విషయానికొస్తే ఈ జట్టు పర్వాలేదనిపిస్తూ మెల్లమెల్లగా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ జట్టు ఐదు విజయలతో పాటు ఐదు ఓటములను చవిచూసింది. ఇక మిగిలిన నాలుగు మ్యాచుల్లో సన్‌రైజర్స్‌ మూడింట్లో విజయాలు సాధించాలి. లేదంటే ప్లే ఆఫ్‌ ఆశలు కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం ప్లే ఆఫ్‌ కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. మొదట్లో జిడ్డుగా ఆడిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పుడు వరుస విజయాలతో జోరును అందుకుంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో రాజస్థాన్‌ అనూహ్య విజయం సాధించి అందరిని ఆశ్చర్యపరిచింది. అజింక్య రహానేను కెప్టెన్సీ నుంచి తప్పించి అతని స్థానంలో మాజీ సారథి స్టీవ్‌ స్మిత్‌కు ఆర్‌ఆర్‌ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అందించింది. పగ్గాలు అందుకున్న మొదటి మ్యాచ్‌ నుంచే స్మిత్‌ అద్భుతంగా తమ జట్టును ముందుండి గొప్ప విజయాలు అందిస్తున్నాడు. సమర్థవంతమైన నాయకుడిగా సహచర ఆటగాళ్లతో కలిసి జట్టును హ్యాట్రిక్‌ విజయాలు అందించాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ కెప్టెన్‌ స్మిత్‌ మెరుగైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. స్మిత్‌ పగ్గాలు అందుకోక ముందు రాజస్థాన్‌ 8 మ్యాచుల్లో కేవలం ఒక విజయమే సాధించి మిగతా 7 మ్యాచుల్లో ఓటములను ఛవిచూసింది. కానీ స్మిత్‌ వచ్చిన తర్వాత ఆ జట్టు రూపురేకలు పూర్తిగా మారిపోయాయి. ఈ ఆసీస్‌ ప్లేయర్‌ అద్భుతమైన కెప్టెన్సీతో తమ జట్టుకు తిరిగి రేసులో నిలిపుతున్నాడు. ఇక శనివారం జైపూర్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఇరు జట్లు తమ ప్లే ఆఫ్‌ బెర్త్‌ మరింత బలపర్చుకోవడం కోసం బరిలో దిగుతున్నాయి. అయితే రాజస్థాన్‌తో పోలిస్తే హైదరాబాద్‌ జట్టే ఫేవరేట్‌గా ఉంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకాలని సన్‌రైజర్స్‌ భావిస్తోంది. ఇక సన్‌ విజయల్లో కీలక పాత్ర పోషించిన విధ్వంసకర ఓపెనర్‌ బెయిర్‌ స్టో రాజస్థాన్‌ మ్యాచ్‌ నుంచి అందుబాటులో ఉండకపోవడం ఆ జట్టు పూడ్చలేని పెద్ద లోటుగా మారింది. వార్నర్‌తో కలిసి బ్యాటింగ్‌లో సత్తా చాటుకున్నఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ బెయిర్‌ స్టో ప్రపంచకప్‌ కోసం తమ స్వదేశానికి తిరిగివెళ్లిపోయాడు. చెన్నైతో జరిగిన మ్యాచే అతనికి చివరిదని సన్‌రైజర్స్‌ యాజమాన్యం ముందుగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మరో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ కూడా త్వరలోనే ఐపిఎల్‌ను వీడనున్నాడు. రాజస్థాన్‌తో మ్యాచే వార్నర్‌కు చివరిది కావచ్చు. ఈ ఇద్దరూ ఓపెనర్లు హైదరాబాద్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వీరులేని లోటు ఇతరులతో పూడ్చడం కష్టమనే చెప్పాలి. బెయిర్‌ స్టో లేకుండా రాజస్థాన్‌తో బరిలో దిగుతుండడం హైదరాబాద్‌కు పెద్ద సవాలే. ఇక మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ఫామ్‌లో రావడం హైదరాబాద్‌కు ప్లస్‌ పాయింట్‌గా మారిందనే చెప్పాలి.

DO YOU LIKE THIS ARTICLE?