సన్‌రైజర్స్‌కు కఠిన సవాల్‌

నేడు టోర్నీ టాపర్‌ సిఎస్‌కెతో పోరు
రాత్రి 8 గంటల నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం
వేదికకానున్న ఉప్పల్‌ స్టేడియం
హైదరాబాద్‌: హ్యాట్రిక్‌ ఓటములతో డీలా పడ్డ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు మరో పెద్ద సవాల్‌ ఎదురుకానుంది. నేడు ఉప్పల్‌ వేదికగా టోర్నీ టాపర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. ఈ ఐపిఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన చెన్నైసూపర్‌ కింగ్స్‌ ఏడింట్లో విజయాలు సాధించింది. దాంతో అందరికంటే ఎక్కువగా 14 పాయింట్లు సాధించి అగ్ర స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ఇక టో ర్నీలో ముందుకు సాగాలంటే హైదరాబాద్‌ ఈమ్యాచ్‌లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిందే. ఇప్పటికే ఇతర జట్లు మెరుగైన ప్రదర్శనలతో జోరును ప్రదర్శిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఓడిన హైదరాబాద్‌ తర్వాత వరుసగా మూడింట్లో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌కు చేరింది. కానీ ఆ తర్వాత మళ్లి పేలవమైన ఆటను కనబర్చుతూ హ్యాట్రిక్‌ ఓటములతో క్రింది నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఇక బుధవారం సన్‌రైజర్స్‌ తన సొంత గడ్డపై పటిష్టమైన చెన్నైతో ఢీ కొననుంది. వరుస విజయాలతో జో రుమీదున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ను సన్‌రైజర్స్‌ అడ్డుకుంటుందేమో చూడాలి.
బ్యాటింగ్‌ మెరుగుపడాలి..
ఎందరో స్టార్‌ బ్యాట్స్‌మెన్‌లు ఉన్న కూడా సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో మెరుగ్గా ఆడలేకపోతుంది. విదేశి ఆటగాళ్లు చెలరేగి ఆడుతుంటే దేశియా ఆటగాళ్లు మాత్రం తమ స్థాయికి తగ్గట్టు రాణించలేక పోవడం ఎస్‌ఆర్‌హెచ్‌ను కలవరపెడుతోంది. ఒకవైపు ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌స్టోలో చెలరేగి ఆడుతుంటే.. మరోవైపు విజయ్‌ శంకర్‌, మనీష్‌ పాండే, దీపక్‌ హూడా, యూసుఫ్‌ పఠాన్‌లు తేలిపోతున్నారు. ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించినా తర్వాతి బ్యాట్స్‌మెన్‌లు మాత్రం ఆ స్కోరును పెద్దగా మరల్చడంలో విఫలమవుతున్నారు. మంచి భాగస్వామ్యాలు కూడా ఏర్పర్చలేకపోతున్నారు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా హైదరాబాద్‌ జట్టు ఛేదించకపోయింది. ఓపెనర్లు తొలి వికెట్‌కు 72 పరుగులు జోడించి ఆరంభాన్ని ఇచ్చారు. తర్వాత వార్నర్‌ (51), బెయిర్‌ స్టో (41) పరుగులు చేసి పెవిలియన్‌ చేరారు. ఆ తర్వాత వచ్చిన 8 మంది బ్యాట్స్‌మెన్స్‌లు కేవలం 38 పరుగుల వ్యవధిలోనే ఇంటిముఖం పట్టారు. దీంతో 78 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయిన హైదరాబాద్‌ అనంతరం 116 పరుగులకే ఆలౌటైపోవడం గమనార్హం. ఆ మ్యాచ్‌లో విలియమ్సన్‌, రికీ భుయ్‌, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హూడా తదితరులు రెండంకెల స్కోరు సైతం దాటలేక పోయారు. అంతకుముందు జరిగిన మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్స్‌లు ఇలాంటి చెత్త ప్రదర్శనలే చేశారు. ఈజీగా గెలవాల్సిన మ్యాచుల్లో చేజేతుల ఓటములను మూటగట్టుకున్నారు. ఇప్పటికే సీజన్‌ సగం మ్యాచులు పూర్తయ్యాయి. ఇక నాకౌట్‌లో చోటు దక్కించుకోవాలంటే తప్పనిసరిగా విజయాలు సాధించాల్సిందే. బ్యాట్స్‌మెన్‌లు తమ తప్పులను సవరించుకొని మంచి ప్రదర్శనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్‌ హైదరాబాద్‌కు కఠిన సవాలే. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన హైదరాబాద్‌ ఈసారి కనీసం నాకౌట్‌ స్టేజ్‌నైన దాటాలని భావిస్తోంది. ప్రస్తుతం టోర్నీలో తీవ్ర పోటీ నెలకొంది. బలహీనంగా కనబడే జట్లు సైతం మెరుగైన ఆటతో పటిష్ట జట్లను మట్టి కరిపిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం లభించిన వాటిని వమ్ము చేసుకొని ముందుకు దూసుకెళ్తున్నాయి. అందుకే ఇలాంటి నేపథ్యంలో ప్రత్యర్థుల సవాళ్లను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు హైదరాబాద్‌ సిద్ధంగా ఉండాలి. బౌలింగ్‌లో పర్వాలేదనిపిస్తున్న సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో కొన్ని ప్రణాళికలు ఏర్పర్చుకుంటే చాలు. సునాయాసంగా గెలుపులు సాధించవచ్చు.
జోరుమీదున్న సూపర్‌ కింగ్స్‌..
మరోవైపు టోర్నీ టాపర్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వరుస విజయాతో జోరుమీదుంది. ఇప్పటికే నాకౌట్‌ స్థానం దాదాపు ఖాయం చేసుకున్న సిఎస్‌కె మరో విజయం సాధిస్తే చాలు. ప్రస్తుతం చెన్నై బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో మెరుగైన ఆటను కనబర్చుతోంది. ప్రపంచ టాప్‌ క్లాస్‌ బ్యాట్స్‌మెన్‌లతో పాటు అగ్రశ్రేణి బౌలర్లు ఈ జట్టుకు అదనపు బలం. బ్యాటింగ్‌లో షేన్‌ వాట్సన్‌, డుప్లెసీస్‌, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ధోనీతో పాటు ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, కేదర్‌ జాదవ్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇక బౌలింగ్‌లో ఇమ్రాన్‌ తాహీర్‌, దీపర్‌ చాహర్‌, శార్దుల్‌ ఠాకుర్‌, సాంట్నర్‌, జడేజాలు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?