సడలిస్తారా?

ఆంక్షల సడలింపుపై వ్యాపార వర్గాల్లో ఉత్కంఠ
సిబ్బందితో రోజూ టెలీకాన్ఫరెన్స్‌
ముందస్తు చర్యలపై కార్యాచరణ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సండలింపుల అంశంపై రాష్ట్రంలోని వ్యాపార వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 17వరకు లాక్‌డౌన్‌ను పొడిగించినప్పటికీ గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్‌ పరిధిలో కేంద్ర ప్రభుత్వం కొంత సడలింపులు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉండబోతుందనే విషయమై పలు వ్యాపార వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఉన్న కొన్ని షాపింగ్‌ మాల్స్‌, అలాగే మరిన్ని స్టోర్లను పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఇందులో భాగంగా తమ సంస్థలో పని చేస్తున్న వారిని ముందస్తుగానే అప్రమత్తం చేస్తున్నారు. ఒక వ్యాపార సంస్థ తమ అవుట్‌ లేట్లకు సంబంధించిన సిబ్బందికి ‘కరోనా కట్టడి’కి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, భౌతిక దూరం తదితర అంశాలపై గత కొన్ని రోజులుగా వారి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. ఒకవేళ స్టోర్‌కు అనుమతి లభిస్తే ఆ స్టోర్‌లో ఎంత మంది ఉండాలి. ఎలా పని చేయాలనే విషయమై వారికి పలు సూచనలు కూడా చేసింది. అలాగే మరో రెడీమెడ్‌ స్టోర్‌కు సంబంధించిన వ్యాపార సంస్థ కూడా స్టోర్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి రోజూ సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది. ముగ్గురు వ్యక్తులకు మించి స్టోర్‌లకు అనుమతి ఇవ్వరాదని, అలాగే ఎక్స్‌ఛేంచ్‌ రూపంలో వచ్చే దుస్తువులను మూడు రోజుల వరకు ఎవ్వరూ తాకవద్దని, వాటిని సుమారు మూడు రోజుల పాటు భద్రం గా ఒక ప్రత్యేక  బాక్స్‌లో పెట్టాలని కూడా సూచించినట్టు తెలిసింది. అయితే మాస్కులు ధరించని వారిని స్టోర్‌ లోపలికి అనుమతించరాదని ఆ సంస్థ స్పష్టం చేసినట్టు తెలిసింది. భౌతిక దూరంతో పాటు శానిటైజర్ల వాడకం, మాస్కులను తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపింది. ఇలా ఎవరికి వారు తమ వ్యాపారాల ని ర్వహణపై సన్నద్ధం అవుతున్నాయి. మార్చి 22నుండి పలు వ్యాపారాలు బంద్‌ కొనసాగుతున్న నేపథ్యంలో స్టోర్లు, షాపులను తెరచిన రోజున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటి నుండే కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నాయి. తమ సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్నాయి. ఈనెల 5న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశ నిర్ణయాలపై వారంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?