సడలిన ఉద్రిక్తత

భారత్‌- చైనా చర్చలు షురూ
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతలను సడలించే దిశగా భారత్‌, చైనాల మధ్య తొలి ప్రయత్నం మొదలైంది. భారత్‌- చైనా మధ్య మిలటరీ (లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌) స్థాయి చర్చలు ప్రారంభమయ్యాయి. భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్‌ మిలటరీ కమాండర్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్‌ లోయ, పాంగాంగ్‌ లేక్‌, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయి. ఈస్టర్న్‌ లడఖ్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి)కి చైనా వైపున మాల్దోలో గల బోర్డర్‌ పర్సనల్‌ మీటింగ్‌ పా యింట్‌లో ఈ చర్చలు జరిగాయి. ఈ క్రమం లో పాంగ్యాంగ్‌ సరస్సు, గాల్వన్‌ లోయ నుం చి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్‌ స్పష్టం చేసింది. కాగా ఇరు దేశాల దౌత్యవేత్తలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ విషయాల గురించి శుక్రవారం చర్చించిన విషయం తెలిసిందే. “శాంతియుత చర్చల ద్వారానే ఇరు వర్గాలు విభేదాలను పరిష్కరించుకోవాలి. భేదాభిప్రాయాలను వివాదాలుగా మారకుండా చూసుకోవాలి”అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ స్థాయి చర్చలకు ముందే ఇరు దేశాల నడుమ రెండుసైన్యాల స్థానిక కమాండర్ల స్థాయిలో 12 దఫాలు చర్చలు జరిగాయి. అలాగగే మేజర్‌ జనరల్‌ స్థాయిలో మూడు రౌండ్ల చర్చలు జరిగాయి. అయితే శనివారం నాటి చర్చలు చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. అందుకే సరిహద్దులో ఉద్రిక్తత సడలినట్లుగా కన్పించింది. సరిహద్దు ఉద్రిక్తతల గురించి చిలువలు పలువలుగా మీడియాలో కథనాలు ప్రచురితమైన నేపథ్యంలో సరిహద్దులో ఏదో జరుగుతున్నందన్న భయం ఇరుదేశాల ప్రజల మధ్య కలిగిన విషయం తెల్సిందే. ఇదిలావుండగా, పొరుగుదేశాలతో తాము ఎల్లప్పుడూ సత్సంబంధాలనే కోరుకుంటామని… అయితే అదే సమయంలో అంగుళం భూమిని కూడా వదులుకోబోమని చైనా స్పష్టం చేసింది. అంతేగాక అమెరికా మాయలో పడవద్దంటూ భారత్‌కు హితవు పలికింది. తూర్పు లడఖ్‌ సమీపంలో నియంత్రణ రేఖ వద్ద భారత్‌- చైనా మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు తన అధికార మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ ఎడిటోరియల్‌లో కథనం ప్రచురించింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకునేందుకు శనివారం ఇరు దేశాల ఉన్నతస్థాయి కమాండర్లు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన నేపథ్యంలో ఈ కథనానికి ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాటి కథనంలో..“ భారత్‌తో చైనా ఎలాంటి వివాదాన్ని కోరుకోవడం లేదు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండటం చైనా జాతీయ ప్రాథమిక విధానం. దశాబ్దాలుగా ఇదే పద్ధతిని పాటిస్తోంది. సరిహద్దు వివాదాలకు శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు ప్రాధాన్యం ఇస్తుంది. భారత్‌ను శత్రువుగా చేసుకునేందుకు మాకు ఏ కారణం కనిపించడం లేదు. అయితే తన భూభాగం నుంచి ఒక్క అంగుళాన్ని కూడా చైనా ఎన్నటికీ వదులుకోదు. వ్యూహాత్మక తప్పిదాలతో చైనా భూభాగంలోకి నెమ్మదిగా ప్రవేశిస్తే.. చైనా అస్సలు క్షమించదు. ధీటుగా బదులిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. సరిహద్దుల్లో చైనా మిలిటరీ ఆపరేషన్స్‌ ఎలా ఉంటాయో ఇండియాకు బాగా తెలుసు” అని తాజా వివాదంపై తన వైఖరిని స్పష్టం చేసింది.అదే విధంగా.. చైనా- భారత్‌ పరస్పరం సహకరించుకుంనే అంతర్జాతీయ సమాజంలో భారత్‌ శాంతియుత సంబంధాలు మరింత మెరుగవుతాయని చైనా అభిప్రాయపడింది.

DO YOU LIKE THIS ARTICLE?