శ్రీకృష్ణ జ్యుయెలర్స్‌పై డిఆర్‌ఐ దాడి

ప్రజాపక్షం/ హైదరాబాద్‌; శ్రీకృష్ణా జ్యుయెలర్స్‌ భారీ మోసాలకు పాల్పడినట్లు డిఆర్‌ఐ అధికారులు గుర్తించారు. విదేశాలకు పంపాల్సిన బంగారు ఆభరణాల ను శ్రీకృష్ణ జ్యుయెలర్స్‌ దేశీయ మార్కెట్‌లో నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్‌ రావిరాలలో స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌లో ఉన్న శ్రీకృష్ణ జ్యుయెలర్స్‌ నగల తయారీ యూనిట్‌పై మంగళవారం ఉదయం డిఆర్‌ఐ అధికారులు ఆకస్మిక దాడి నిర్వహించారు. దాడిలో శ్రీకృష్ణ జ్యుయె లర్స్‌ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా 1100 కిలోల బంగారు ఆభరణాలను తయారు చేసి దేశీయ మార్కెట్‌లో విక్రయించినట్లు తేల్చారు. బంగారు ఆభరణాలలో నకిలీ రంగు రాళ్లు పేర్చినట్లు కూడా తేలింది. నిజానికి తయారు చేసిన ఆభరణాలను విదేశాలకు పంపడానికి మాత్రమే వీరికి అనుమతి ఉంది. అయితే విదేశాలకు పంపించకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో 35 బంగారు నగల దుకాణాలకు అక్రమంగా వీటిని విక్రయించారు. ఈ మేరకు ప్రభుత్వానికి పన్నుల రూపంలో రావాల్సిన కోట్లాది రూపాయలను కూడా వీరు పక్కదారి పట్టించినట్లు తేలింది. ఈ సోదాలలో అక్రమంగా నిల్వ చేసిన రూ.14.87 కోట్ల విలువైన బంగారు ఆభణాలను డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు డిఆర్‌ఐ అధికారులు రావిరాల యూనిట్‌తో పాటు బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణ జువెలర్స్‌కు చెందిన గౌడాన్‌పై కూడా దాడులు నిర్వహించారు. శ్రీకృష్ణ జువెలర్స్‌ ఎండి ప్రదీప్‌కుమార్‌తో పాటు అతని కుమారుడు సాయి చరణ్‌ మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డిఆర్‌ఐ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?