శాంతిమార్గం

భారత్‌, చైనాల మధ్య కుదిరిన అంగీకారం
న్యూఢిల్లీ: సరిహద్దు సమస్యలను శాంతియుతం గా పరిష్కరించుకునేందుకు సైనిక, దౌత్యపరమైన చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలని భారత్‌, చైనాలు అంగీకరించాయి. ఇరుదేశాల నాయకుల గతంలో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, మార్గదర్శకాలను అనుసరించి నడుచుకోవాలని నిర్ణయించాయి. ఇండో-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాల సైనికాధికారుల మధ్య శనివారం లడఖ్‌లో కీలక సంప్రదింపులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా, భారత్‌- చైనా మధ్య ప్రారంభమైన మిలటరీ స్థాయి చర్చ ల్లో భారత్‌ తరఫున లెఫ్టినెంట్‌ జనరల్‌ హరీందర్‌ సింగ్‌ హాజరుకాగా.. చైనా తరఫున టిబెట్‌ మిలటరీ కమాండర్‌ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితిని శాంతియుత పరిష్కారం ద్వారా చక్కదిద్దాలని భారత్‌, చైనాలు నిర్ణయించాయని ఇరు దేశాల మధ్య జరిగిన సైనికాధికారుల చర్చలపై భారత్‌ వ్యాఖ్యానించింది. ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఇరు దేశాలు అంగీకరించాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. భారత్‌, చైనాల మధ్య జరిగిన సైనికాధికారుల సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలకు అనుగుణంగా సామరస్యంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరిందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఉద్రిక్తతలకు దారితీసిన గాల్వన్‌ లోయ, పాంగాంగ్‌ లేక్‌, గోగ్రా ప్రాంత సరిహద్దు వివాదాలే ప్రధాన ఎజెండాగా చర్చలు కొనసాగాయని సమాచారం. ఈ క్రమంలో పాంగాంగ్‌ సరస్సు, గాల్వన్‌ లోయ నుంచి చైనా బలగాలు వెనుదిరగాలని.. అదే విధంగా అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆర్మీ శిబిరాలను వెంటనే తొలగించాలని భారత్‌ స్పష్టం చేసింది. ఇరుదేశాల సైన్యాలకు చెందిన సైనిక కమాండర్ల సుదీర్ఘ సమావేశం తూర్పు లడఖ్‌ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఎసి)కి చైనా వైపున గల మాల్దోలోని మీటింగ్‌ పాయింట్‌లో జరిగింది. చర్చలు కొనసాగించే ముందు గతంలో ఇరుదేశాల నేతల మధ్య కుదిరిన ఒప్పందాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నారు. 2018లో వుహాన్‌ నగరంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ల మధ్య చారిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం జరిగిన విషయం విదితమే. శాంతిని కొనసాగించడానికి ఇరుదేశాలు కచ్చితంగా ప్రాముఖ్యతను ఇవ్వాలని ఆనాడు ఇద్దరు నేతలు అంగీకరించారు. దానికి అనుగుణంగానే తాజా మిలటరీ స్థాయి చర్చలు జరిగాయని విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది.

DO YOU LIKE THIS ARTICLE?