వీరుడా.. నీ త్యాగం వృథా కాదు

మాతృభూమి నిన్ను ఎన్నటికీ మరువదు
కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబాన్ని పరామర్శించిన సిఎం కెసిఆర్‌
రూ. 5 కోట్ల ఆర్థిక సహాయం
ఇంటి స్థలం, గ్రూప్‌ 1 ఉద్యోగ నియామక పత్రం అందజేత
ప్రజాపక్షం/ సూర్యాపేటబ్యూరో
భారత్‌, చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు త్యాగం వృథా కాదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అన్నారు. ఆయనను ఈ మాతృభూమి ఎన్నటికీ మరువదని చెప్పారు. సోమవారం సిఎం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంతోష్‌బాబు కుటుంబాన్ని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి పరామర్శించారు. ముందుగా సంతోష్‌బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆయన మరణంతో పుట్టేడు దుఃఖంతో ఉన్న కల్నల్‌ తండ్రి బిక్కుమళ్ళ ఉపేందర్‌, తల్లి మంజుల, సతీమణి సంతోషి వారి పిల్లలు అభిగ్న, అనిరుద్‌లను ఓదార్చారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండ గా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించవచ్చన్నారు. సంతోష్‌బాబు కుటుంబ సభ్యుల బాగోగులను చూసుకోవాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని కోరారు. అనంతరం
సంతోష్‌బాబు భార్య సంతోషికి రూ. 4 కోట్ల రూపాయల చెక్కును, హైదరాబాద్‌లోని బంజారహిల్స్‌లో 711 గజాల ఇంటి స్థలం, గ్రూప్‌ ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలను అందజేశారు. అలాగే ఆయన తండ్రి ఉపేందర్‌, తల్లి మంజులకు కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జె. సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపిక యుగంధర్‌రావు, ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్‌, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్యయాదవ్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, డిసిసిబి చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, టిఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి తంకెళ్ళపల్లి రవీందర్‌రావు పాల్గొన్నారు.
సిఎం కెసిఆర్‌ భరోసా… ధైర్యాన్నిచ్చింది
సిఎం కెసిఆర్‌ ఇచ్చిన భరోసా తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అమర జవాన్‌ కల్నల్‌ సంతోష్‌బాబు సతీమణి సంతోషి అన్నారు. స్వయంగా సిఎం, మంత్రి జగదీస్‌రెడ్డి తమ ఇంటికి వచ్చి పుట్టేడు దుఃఖంలో ఉన్న మమ్మల్ని ఓదార్చాడంతో పాటు అన్ని విధాలుగా ఆదుకోవడం ఎన్నటికీ మరువమన్నారు. వారికి తామేంతో రుణపడి ఉన్నామని అన్నారు. సిఎం కెసిఆర్‌ పరామర్శ అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్త సంతోష్‌బాబు కార్యక్రమాలు అన్నిపూర్తి అయినా తరువాత తన ఇంటికి రావాలంటూ సిఎం కెసిఆర్‌ ఆహ్వానించడం పట్ల ఆమె ధన్యావాదాలు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?