విషాదం

కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం
15 మంది మృత్యువాత
మృతులంతా గద్వాల జిల్లాకు చెందిన వారే
తుఫాను వాహనాన్ని ఢీకొన్న ప్రైవేటు బస్సు
నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి వస్తూ మృత్యు ఒడికి
నాగర్‌కర్నూల్‌/ గద్వాల్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వెల్దుర్తి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు అతివేగంతో వెళ్తున్న ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు గద్వాల వైపు వెళ్తున్న తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో తుఫాను వాహనంలో వస్తున్న 15 మంది మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలోనే 13 మంది మృతిచెందగా, చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. వెల్దుర్తిలోని ఓ మలుపు వద్ద ఎదురుగా వస్తోన్న ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను దాటి అటువైపుగా వస్తోన్న తుఫాన్‌ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టింది. వాహనంలో 17 నుంచి 20 మంది ఉన్నట్లు సమాచారం. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరిలో మాసుం అనే వ్యక్తి మృతి చెందడంతో మృతుల సంఖ్య 15కి చేరింది. కాజా అనే వ్యక్తి కర్నూలు సర్వజన ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ప్రస్తుతం అతడికి వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో తుఫాను వాహనం నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలను బయటకు తీయడం ఇబ్బందిగా మారిందని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మృతులను తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. అందరూ దగ్గరి బంధువులే. మృతుల్లో వెంకట్రాముడు (30), గోపీనాథ్‌ (25), రాము డు (45) మునిస్వామి(30), భాస్కర్‌(30), సోమన్న(40), తిక్కన (40), సాలన్న(30), నాగరాజు(25), పరుశు రాముడు (28), సురేష్‌ (30), విజయ్‌(35), పగులన్న(45), చింతలన్న(55) పోలీసులు వెల్లడించారు.
కాసేపట్లో ఇంటికి చేరతారనగా ఘోరం..
అనంతపురం జిల్లా గుంతకల్లులో వివాహ నిశ్చితార్ధ వేడుకను ముగించుకొని సాయంత్రం వేళ బయల్దేరారు. ఉదయం నుంచి జరిగిన నిశ్చితార్థ విశేషాలను నెమరువేసుకుంటూ ఎంతో సందడిగా సొంత ఊరు పయనమయ్యారు. మరి కాసేపట్లో ఇంటికి చేరుకోబోతున్నారు. ఇంతలోనే వారిని బస్సు రూపంలో మృ త్యువు కబళించింది. వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. రెప్పపాటులో జరిగిన ఈ పెను ప్రమాదం 15 మంది ప్రాణాలను బలితీసుకుంది. తుఫాను వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో 13 మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పెళ్లి కుమారుడు కూడా మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు. బస్సు అతివేగంతో రావడమే కాకుండా తుఫాను వాహనం కూడా వేగం గా రావడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని చెబుతున్నారు. ఘటనా స్థలానికి కర్నూలు జిల్లా ఎస్‌పి ఫకీరప్ప చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను కర్నూలు ఆస్పత్రికి తరలించనున్నట్టు ఎస్‌పి తెలిపారు. మృతుల్లో మిగిలిన వారి పేర్లను గుర్తించి మృతదేహాలను బంధువులకు ఆదివారం అప్పగిస్తామని స్పష్టంచేశారు. బస్సు డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదమూ జరగలేదని ఎస్‌పి ఫకీరప్ప తెలిపారు.
శోకసంద్రంలో రామాపురం
వాళ్లంతా చిన్నాన్న, పెద్దనాన్న అంటూ వరుసలు కలుపుకొని పిలుచుకునే వాళ్లు. దుర్ఘటన వినగానే ఆ గ్రామం శోక సంద్రంలో మునిగిపోయింది. నిన్నటి వరకు మనతో తిరిగిన వాళ్లు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని వారంతా కన్నీ రు మున్నీరవుతున్నారు. అసలు ఆ శుభకార్యానికి ఎవరెవరు వెళ్లారనే దానిపై ఆరా తీస్తున్నారు. తమ ప్రాణ మిత్రులను, బంధువులను తలచుకుంటూ బోరున విలపిస్తున్నారు.వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. ఇంకొందరు హుటాహుటీన ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లి అక్కడి విషయాలను గ్రామస్థులకు, బంధువులకు చేరవేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు దిగ్భ్రాంతి
వెల్దుర్తి రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మృతి చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్‌, చంద్రబాబు, టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి.రామారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనలో గాయపడి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి అవసరమైన సాయం అందించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ను సిఎం ఆదేశించారు. అదే విధంగా ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కూడా క్షతగాత్రులకు అత్యున్నత వైద్యం అందించాలని ఆదేశించారు. పిసిసి అధ్యక్షులు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఘటనపట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు తన ప్రగాడ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కాగా, ప్రమాద ఘటనపై వైసిపి అధ్యక్షుడు జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని జగన్‌ ఆకాంక్షించారు.

DO YOU LIKE THIS ARTICLE?