వివ్‌ రిచర్డ్‌ను దాటేసిన రోహిత్‌..

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ (133) అద్భుతమైన బ్యాటింగ్‌తో 22వ శతకాన్ని నమోదు చేశాడు. అయితే ఈ శతకాన్ని సాధించిన రోహిత్‌ మరో అరుదైన మైలురాయిని దాటాడు. వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో 110 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్‌ ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో 4వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే ఆసీస్‌లో ఈ ఘనత సాధించిన తొలి విదేశీ క్రికెటర్‌గా రోహిత్‌ శర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. విండీస్‌ దిగ్గజ బ్యాట్స్‌మన్‌ ఆసీస్‌ గడ్డపై మూడు సెంచరీలు నమోదు చేశాడు. తాజాగా రోహిత్‌ అతనిని దాటేశాడు. మరోవైపు భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆస్ట్రేలియాలో రెండు శతకాలు సాధించాడు.
గంగూలీ సరసన..
ఇక్కడ జరిగిన మొదటి వన్డేలో ఆసీస్‌పై అద్భుతమైన శతకాన్ని నమోదుచేసిన రోహిత్‌ శర్మ తన ఖాతాలో 22వ శతకాన్ని వేసుకున్నాడు. అయితే ఈ తాజా శతకంతో రోహిత్‌ భారత మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ సౌరభ్‌ గంగూలీ సరసన చేరాడు. అయితే ఈ ఫీట్‌ను గంగూలీకి 311 వన్డేల్లో అందుకుంటే.. రోహిత్‌ శర్మ మాత్రం 194వ వన్డేల్లో పూర్తి చేశాడు. మరోవైపు వీరిద్దరి సరసన శ్రీలంక ఆటగాడు తిలక రత్నే దిల్షాన్‌ (22 సెంచరీలు) ఉన్నాడు. కాగా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్లలో మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ (49) శతకాలతో అగ్ర స్థానంలో ఉన్నాడు. మరోవైపు పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ (38) శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి తర్వాత రికీపాంటింగ్‌ (30), సనత్‌ జయసూర్య (28), హాషిమ్‌ ఆమ్లా (26), ఎబి డివిలియర్స్‌ (25), కుమార సంగకార (25), క్రిస్‌ గేల్‌ (23) సెంచరీలతో రోహిత్‌ కంటే ముందున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?