వివిపాట్‌లపై రివ్యూ పిటిషన్‌

సుప్రీంకోర్టులో దాఖలు చేసిన 21 ప్రతిపక్ష పార్టీలు
50 శాతం లెక్కించేలా ఇసికి ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: వివిపాట్‌ స్లిప్పుల లెక్కింపు వ్యవహారంపై 21 పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి. 50 శాతం స్లిప్పులు లెక్కించేలా ఇసికి ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్‌లో అత్యున్నత న్యాయస్థానాన్ని కోరాయి. 50 శాతం వివిపాట్‌ స్లిప్పులు లెక్కించాలంటూ పార్టీలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం.. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 వివిపాట్‌ యంత్రాల స్లిప్పులు లెక్కించాలని తీర్పు ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందని పార్టీలు.. 50 శాతం తప్పనిసరిగా లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బుధవారం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశాయి.మూడో విడత ఎన్నికలు ముగిశాక దాఖలుచేసిన ఈ రివ్యూ పిటిషన్‌లో ‘ఇవిఎంలతో వివిపాట్ల మ్యాచింగ్‌ను కేవలం 2 శాతం పెంచినంత మాత్రాన సరిపోదు. దీనివల్ల పెద్ద తేడా ఏమీ ఉండబోదు’ అని పేర్కొన్నాయి. వివిపాట్ల వెరిఫికేషన్‌ను తగినంత(రీజనేబుల్‌ నంబర్‌) పెంచాలని కోరాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక బూత్‌లలో వివిపాట్‌ మెషిన్లు సరిగా పనిచేయలేదని కూడా ఉటంకించాయి. ‘ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 618 పోలింగ్‌ బూత్‌లలో పోలింగ్‌ ఆలస్యం అయింది,20పోలింగ్‌ బూత్‌లలో శాంతిభద్రతల సమ స్య తలెత్తింది’అని ప్రతిపక్షాలు తమ పిటిషన్లో పేర్కొన్నాయి. 50 శాతం వివిపాట్లు లెక్కిస్తే ఫలితాలు మరింత ఆలస్యమవుతాయన్న ఇసి వాదనను మరోసారి ప్రతిపక్షాలు తోసి పుచ్చాయి. సరైన వనరులు, సిబ్బంది, సాంకేతికను ఉపయోగిస్తే ఇదేమంత కష్టం కాదని అభిప్రాయపడ్డాయి. ప్రతిపక్షాలు కోరుకుంటున్నట్లు 50శాతం వివిపాట్లు లెక్కించడానికి సమయం, సిబ్బంది ఎక్కువ కావాలని ఇసి చెబుతోంది. ఒక్కో వివిపాట్‌ లెక్కించడానికి ముగ్గురు ఎన్నికల సిబ్బంది అవసరమవుతారని ఇది వరకే వెల్లడించింది. అయితే ఇసి వ్యాఖ్యలను కాదని మరోసారి ప్రతిపక్షాలన్నీ రివ్యూ పిటిషన్‌ వేశాయి. ‘50శాతం స్లిప్పులు లెక్కించినట్లయితే ఎన్నికల సంఘం మీద, ఇవిఎంల మీద ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుంది. ఫలితాల్లో సైతం కచ్చితత్వం కనిపిస్తుంది. అంతేగానీ ఎవర్నీ నిందించడానికో లేదా అవమానపరచడానికో మేండిమాండ్‌ చేయడం లేదు.ప్రజా ప్ర యోజనం కోసమే 50 శాతం స్లిప్పులు లెక్కించాలని పట్టుబడుతున్నాం’ అ ని పిటిషన్‌ వేసే సమయంలో మరోసారి ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.ఇవిఎంలతో వివిపాట్‌ స్లిప్పులు మ్యాచింగ్‌ మెషిన్లను పెంచాలని సుప్రీంకోర్టు ఇదివరకే ఏప్రిల్‌ 8న ఆదేశించింది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కనీసం 50 శాతం వివిపాట్‌ స్లిప్పులను ఇవిఎంలతో లెక్కించాలన్న 21 ప్రతిపక్షాల డిమాండ్‌ను సుప్రీంకోర్టు అంగీకరించలేదు.కానీ ప్రతిపక్షాల పిటిషన్‌ను పరిష్కరించింది. 5బూత్‌లలో లెక్కించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

DO YOU LIKE THIS ARTICLE?