వినోదం వ్యాపారమా?

సినిమా టిక్కెట్ల ధరల పెంపుపై తెలంగాణ సర్కార్‌ సీరియస్‌

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : సినీ ప్రేక్షకులకు సినిమా థియేటర్ల పేరు వింటేనే భయపడేలా వాటి యాజమాన్యాలు టిక్కెట్ల ధరలను పెంచడం పట్ల ప్రభుత్వం సీరియస్‌ అయిం ది. కనీసం ప్రభుత్వంతో సంప్రదించకుండా, సమాచారం కూడా ఇవ్వకుండా ధరలను ఎకాఎకీన పెంచేయడాన్ని ఆక్షేపించింది. థియేటర్ల యాజమాన్యాలు సినిమా వినోదాన్ని ఫక్తు వ్యాపారంగా చూడటం ఏమిటని తప్పుబట్టింది. ఇప్పటికే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తెలంగాణలో భారీ రాయితీలు, ప్రోత్సహకాలను ఇస్తున్నామని, ఇన్ని రాయితీలు పొంది తీస్తున్న సినిమా ప్రేక్షకులకు వినోదం పంచాలే తప్ప టిక్కెట్ల ధరల పెంపు రూపంలో అదనపు ఆర్థిక భారంగా పరిణమించరాదని ఆక్షేపించింది. సినిమా యాజమాన్యాలు హైదరాబాద్‌ నగరంతో పాటు జిల్లాల్లోనూ ధరలు పెంచేశారు. ధరల పెంచడానికి ఇంకా వారం పట్టవచ్చని అంతా భావిస్తున్న సమయంలోనే మల్టిప్లెక్స్‌ థియేటర్లలో ఒక్కో టిక్కెట్టు మీద రూ. 50 పెంపుదల చేశాయి. హీరో మహేశ్‌బాబు, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌తో “మహర్షి” సినిమా గురువారం విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా  విడుదలను పురస్కరించుకుని అభిమానులు ఈజీ మూవీస్‌ డాట్‌ కామ్‌ తదితరాల ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోగా వారు పెరిగిన ధరలు చూసి ఒక్క సారిగా అవాక్కయ్యారు. రూ.75 ఉన్న టిక్కెట్ల ధరలను 105కు పెంచారు. అలాగే రూ. 100 టిక్కెట్ల ధర 120కి పెంచారు. అది కూడా ప్రభుత్వం నుండి అనుమతి లేకుండానే పెంచచడం గమనార్హం.

DO YOU LIKE THIS ARTICLE?