విద్యుత్‌ బిల్లులపై రాయితీలివ్వండి?

ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : మూడు నెలల విద్యుత్‌ బిల్లు లు ఒకేసారి జారీ చేయడం వల్ల వినియోగదారులకు పెద్ద మొత్తంలో బిల్లులు వస్తున్నాయని, కరోనా లాక్‌డౌన్‌ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గత ఏడాది ఇవే మాసాల్లో జారీచేసిన బిల్లులను వర్తింపజేయడం లేదా ప్రత్యేక రాయితీలను కల్పించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి కోరారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూడు నెలల పాటు విద్యుత్‌ బిల్లులను ఒకేసారి రీడింగ్‌ తీయడంతో వినియోగదారులకు పెద్ద మొత్తంలో బిల్లులు వస్తున్నాయని, శ్లాబు మారి కేటగిరి 3 వర్తింపజేయటంతో ప్రజలకు తలకు మించిన భారంగా మారిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఒకవైపున లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడం, మరోవైపు చేతిలో ఆదాయం లేకపోవడంతో వినియోగదారులకు విద్యుత్‌ బిల్లులు శరాఘాతంగా మారాయన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు రెండు నెలలు మూసి ఉంచినా పెద్ద మొత్తంలో బిల్లులు రావడంతో యాజమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నదన్నారు. అధిక బిల్లులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మూడు నెలలకు ఒకేసారి రీడింగ్‌ తీయడం మూలంగా స్లాబులు పెరిగి యూనిట్‌ కాస్ట్‌ ఎక్కువ మొత్తంలో పడిందన్నారు. బిపిఎల్‌ వినియోగదారులను కేటగిరి 1, 2 లోనే గుర్తించి బిల్లులు వేయడం సమంజసంగా ఉంటుందన్నారు. నాన్‌ టెలిస్కోపిక్‌ విధానంతో కాకుండా, టెలిస్కోపిక్‌ విధానంలో బిల్లులు జారీ చేయాలని, ఆలస్య రుసుం మాఫీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?