విదేశీ పర్యటన విజయవంతం

సత్తా చాటిన టిమిండియా
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో చిరస్మరణీయ ప్రదర్శనలు
ఆలౌరౌండ్‌ షోతో ఆకట్టుకున్న భారత్‌
 క్రీడావిభాగం : ఒకప్పుడు విదేశీ పర్యటన అంటే టీమిండియాకు చేదు జ్ఞాపకాలే.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆటగాళ్లు మారారు. ఉప ఖండంలోనే కాకుండా విదేశాల్లోనూ తమ సత్తా చాటుకుంటున్నారు భారత క్రికెటర్లు. యువ ఆటగాళ్లతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు సైతం చెలరేగిపోతున్నారు. ఫాస్ట్‌ పిచ్‌లైనా.. స్లో పిచ్‌లు అయినా తేడాలేకుండా అన్ని పిచ్‌లపై ధనాధన్‌ పరుగులు సాధిస్తున్నారు. గత మూడు నెలలుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనను భారత పురుషుల క్రికెట్‌ జట్టు విజయవంతంగా ముగించింది. ఆరంభంలో ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై మట్టి కరిపించింది. ఆ తర్వాత కివీస్‌ను వారి సొంత మైదానాల్లో వన్డేల్లో చిత్తుగా ఓడించింది. టి20 సిరీస్‌లోనూ గట్టి పోటీనిచ్చింది. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా ప్రదర్శన అమోఘం. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో అద్భుతంగా పోరాడింది. పటిష్టమైన ఆస్ట్రేలియాను వారి మైదానాల్లోనే చిత్తు చేసింది. కివీస్‌ పర్యటనలో పూర్తి జట్టుతో ఆడకపోయినా మంచి ఫలితాలను రాబట్టింది. ఇక ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ కోసం పూర్తిగా సిద్ధమయింది. భారత మాజీలే కాకుండా ప్రపంచ అగ్ర ఆటగాళ్లు టీమిండియా ఆటను ప్రశంసిస్తున్నారు. ప్రపంచకప్‌లో భారత జట్టే తమ ఫేవరేటని చేబుతున్నారు. భారత జట్టు ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ప్రపంచ టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లతో ఏ జట్టుకైనా సవాళ్లు విసిరే స్థాయికి ఎదిగింది. ఒకానొక సమయంలో ఫాస్ట్‌ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్స్‌ ప్రదర్శనలు పేలవంగా ఉండేవి. ప్రత్యర్థి బౌలింగ్‌లో పరుగులు చేయడం దూరం పిచ్‌పై నిలవడం కూడా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టీమిండియాలో చాలా మార్పులు వచ్చాయి. భారత క్రికెట్‌ బోర్డు అద్భుతంగా ఎదుగుతూ ప్రపంచ టాప్‌ శిక్షణలు, వసతులు తమ ఆటగాళ్లకు అందిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ కోచ్‌లతో మంచి శిక్షణలు అందిస్తున్నది. ఇక దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి టోర్నీలను నిర్వహించడం ద్వారా ప్రతిభావంతులైన ఆటగాళ్లు దేశం నలుమూలల నుంచి వెలికి వస్తున్నారు. అందుకే జాతీయ జట్టులో ఎవరిని తీసుకోవాలో.. ఎవరిని వదిలిపెట్టాల్లో అర్థంకాక సెలెక్టర్లు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. దొరికిన అవకాశాన్ని సద్వినియోగించుకోకపోతే తిరిగి చాన్స్‌ దొరకడం కష్టంగా మారింది. ఇది కేవలం యువ ఆటగాళ్ల పరిస్థితి కాదు.. సీనియర్లు కూడా తమ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. ఒకప్పుడు టీమిండియాలో కీలక స్పిన్నర్‌గా రాణించిన రవిచంద్ర అశ్విన్‌ ఇప్పుడు జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో చోటు ఉన్నా.. మిగతా ఫార్మాట్లలో చోటు సాధించడం అతనికి కష్టంగా మారింది. యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనలతో సీనియర్ల చోటును భర్తీ చేస్తున్నారు. నిరంతరం ఫామ్‌తో ఉండడం ముఖ్యంగా మారింది. గాయాల బారిన పడకుండా తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటే మంచిదని సీనియర్లకు సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియాను చిత్తు చిత్తుగా..
విదేశీ పర్యటనలో భాగంగా గత ఏడాది నవంబర్‌లో భారత జట్టు మొదట ఆస్ట్రేలియాలో అడుగుపెట్టింది. అక్కడ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌తో పర్యటనను ఆరంభించింది. వర్షం పలుమార్లు అంతరాయం కలిగించడంతో తొలి మ్యాచ్‌లో భారత జట్టు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం నాలుగు పరుగులతో ఓడిపోయింది. తర్వాతి మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయింది. ఇక మిగిలిన చివరి మ్యాచ్‌ భారత జట్టుకు డూ ఆర్‌ డైగా మారింది. కానీ భారత ఆటగాళ్లు ఆ మ్యాచ్‌లో చెలరేగి ఆడారు. ఆసీస్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని భారత్‌ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఇక సిరీస్‌ అమాంతం తన బ్యాట్‌ను ఝుళిపించిన శిఖర్‌ధావన్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు. తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా అద్భుతంగా పోరాడింది. వారి గడ్డపై బలమైన ఆసీస్‌ను ఓడించడమంటే సులువుకాదు. కానీ భారత ఆటగాళ్లు టెస్టు సిరీస్‌లోనూ అదిరే ఆరంభం చేశారు. ఆడిలైడ్‌ వేదికగా డిసెంబర్‌ 6 నుంచి మొదలైన మొదటి టెస్టులో భారత జట్టు అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో మెరుగైన ప్రదర్శనలతో రాణించి 31 పరుగులతో విజయం సాధించింది. తర్వాతి టెస్టులో పుంజుకున్న ఆస్ట్రేలియా టీమిండియాను 146 పరుగులతో ఓడించి సిరీస్‌ను సమం చేసింది. ఇక తర్వాత కీలకమైన మూడో టెస్టులో భారత జట్టు తిరిగి పుంజుకుంది. ఒకవైపు బౌలర్లు విజృంభిస్తే.. మరోవైపు బ్యాటింగ్‌లో చతేశ్వర్‌ పుజారా అద్భుతమైన బ్యాటింగ్‌తో కోహ్లీ, రోహిత్‌ శర్మలు మెరవడంతో భారత్‌ 137 పరుగులతో ఘన విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా గడ్డపై ఇప్పటివరకు సాధ్యంకాని చారిత్రాత్మకమైన గెలుపుతో సిరీస్‌లో 2 ఆధిక్యం సాధించింది. ఇక చివరి టెస్టులో కూడా అద్భుతంగా పోరాడింది. ఈ మ్యాచ్‌లో పుజారా (193), యువ సంచలనం రిషభ్‌ పంత్‌ (159), మయాంక్‌ అగర్వాల్‌ (77), జడేజా (81) రాణించడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 622/7 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాను 300 పరుగులకే భారత బౌలర్లు కట్టడి చేశారు. కుల్దీప్‌ యాదవ్‌ 5 వికెట్లతో చెలరేగాడు. మ్యాచ్‌ పూర్తి రోజులు ముగియడంతో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మరోవైపు భారత్‌ సిరీస్‌లో ఆధిక్యంతో చారిత్రక విజయంతో సంచలనం సృష్టించింది. తర్వాత వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ను ఓడిపోయినా టీమిండియా తర్వాతి మ్యాచుల్లో వరుస విజయాలతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2 ముగించారు. తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
కివీస్‌లోనూ అదే జోరు..
ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించిన టీమిండియా సమరోత్సవంతో న్యూజిలాండ్‌ గడ్డపై అడుగుపెట్టింది. అక్కడ కూడా అదే జోరును కొనసాగించి హ్యాట్రిక్‌ విజయాలతో మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3 కైవసం చేసుకుంది. తర్వాతి రెండు వన్డేలకు కెప్టెన్‌ కోహ్లీకి బిసిసిఐ విశ్రాంతి కల్పించడంతో మిగిలిన మ్యాచ్‌లకు రోహిత్‌ శర్మ సారథ్యం వహించాడు. నాలుగో వన్డేలో ఘోర ఓటమిని చవిచూసిన భారత జట్టు తర్వాత ఐదో వన్డేలో అద్భుతంగా రాణించింది. ఆలౌరౌండ్‌ ప్రదర్శనలతో ఆఖరి వన్డేను 7 వికెట్లతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా 4 ఘనంగా ముగించింది. తర్వాత టి20 సిరీస్‌లోనూ మెరుగైన ప్రదర్శనలు చేసింది. కానీ కివీస్‌ జట్టు భారత్‌ కంటే మెరుగ్గా ఆడడంతో 1 సిరీస్‌ కోల్పోయింది. ఓవరాల్‌గా టీమిండియా ఆల్‌రౌండర్‌ ప్రదర్శనలతో ఆకట్టుకుంది. విదేశీ పర్యటనను సగర్వంగా ముగించింది. ఇక ఇప్పుడు స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు సిద్ధమవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?