విజృంభిస్తున్న కరోనా రక్కసి

దేశంలో కొత్తగా 11,458 కేసులు నమోదు.. 386 మంది మృతి
3,08,993కు చేరిన కొవిడ్‌ బాధితుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా రక్కసి విజృంభిస్తోంది. దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. గత 24 గంటల్లో శనివారం ఉదయం 10 వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 11,458 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో బాధితుల సంఖ్య 3,08,993కు చేరింది. వీరిలో 1,45,779 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 1,54,329 మంది కోలుకున్నారు. కొత్తగా 386 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 8,884కు పెరిగింది. మరోవైపు దేశంలో రికవరీ రేటు 49.94 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, జార్ఖండ్‌, కర్నాటక, మేఘాలయ, ఒడిశా, తెలంగాణ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కొత్త కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇక అత్యధిక కేసులతో విలవిల్లాడుతున్న మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,01,141 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. తమిళనాడు 40,698, ఢిల్లీ 36,824 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,25,000 దాటింది. తీవ్రత ఎక్కువగా ఉన్న బ్రెజిల్‌ మరణాల సంఖ్యలో బ్రిటన్‌ను దాటింది. ఇప్పటివరకు అక్కడ 42,000 మందికి పైగా మృతిచెందారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదైన తొలి పది దేశాల జాబితాలో భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
మహారాష్ట్రలో లక్ష దాటిన కేసులు
మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శనివారం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్క్‌ దాటింది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,493 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ బాధితుల సంఖ్య 1,01,141కు చేరింది. ఇప్పటి వరకు 3,717 మరణాలు నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో పరిస్థితి రోజురోజుకీ దిగజారుతోంది. ఇప్పటివరకు విధించిన లాక్‌డౌన్‌ అమలుతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఈ నేపథ్యంలో మరోసారి లాక్‌డౌన్‌ ప్రకటన ఉండబోదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే స్పష్టం చేశారు. కేసులు అంతకంతకూ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఆర్థిక కష్టాల నేపథ్యంలో ఆంక్షల తొలగింపు అనివార్యమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కేసులు పెరగడం సహజమని, ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పడతాయని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేసుల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న తమిళనాడులో బాధితుల సంఖ్య 40,698కి చేరింది. గత 24 గంటల్లో కొత్తగా 1,982 కేసులు నమోదయ్యాయి. వీరిలో 22,000 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. 367 మంది ప్రాణాలు కోల్పోయారు. 36,284 కేసులతో ఢిల్లీ మూడో స్థానంలో కొనసాగుతోంది. వీరిలో 13,398 మంది కోలుకోగా.. 1,214 మంది మృత్యువాత పడ్డారు. మే 30, జూన్‌ 11 మధ్య దేశ రాజధానిలో వ్యాప్తి రేటు 21 శాతం పెరగ్గా.. రికవరీ రేటు 8 శాతం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. గుజరాత్‌లో శనివారానికి కేసుల సంఖ్య 22,527కు పెరిగింది. 15,493 మంది కోలుకున్నారు. 1,415 మంది మరణించారు. ఇక ఉత్తరప్రదేశ్‌ 12,616 కేసులతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. శుక్రవారం-శనివారం మధ్య కొత్తగా 528 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి 365 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమబెంగాల్‌లో కొవి్‌డzwnj; కేసుల సంఖ్య 10 వేల మార్క్‌ను దాటింది. గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 476 కేసులు నమోదుకావడంతో అక్కడ కరోనా నిర్ధారణ అయిన వారి సంఖ్య 10,244కు పెరిగింది. కేసుల సంఖ్యలో ప్రస్తుతం ఈ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక మరణాల సంఖ్య 451గా నమోదైంది.

DO YOU LIKE THIS ARTICLE?