వాస్తవాలను దాస్తున్నారు

‘ఆక్సిజన్‌ మరణాల’ వివాదంలో కేంద్ర సర్కారు తీరుపై విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ అం దని కారణంగా రోగులు చనిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు ఏవీ లేవని కేంద్ర చేసిన ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవాలను దాస్తున్నారంటూ మండిపడ్డాయి. ఇది బాధ్యతారహితమైన ప్రకటన అంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించగా, ఆక్సిజన్‌ కొర త కారణంగా చాలా మంది కొవిడ్‌ రోగులు మృతి చెందారనడం నిజమనీ, కానీ దీనిని ప్రభుత్వం అంగీకరించడం లేదని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ అన్నారు. కేంద్రం అనుసరించిన విధానాలే సెకండ్‌ వేవ్‌లో ఆక్సిజన్‌ కొరతకు కారణమైందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఆరోపించా రు. ఆక్సిజన్‌ కొరతతో ఎవరూ మృతి చెందలేదనే రీతిలో కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొనడం విమర్శలకు దారితీసింది. ఆక్సిజన్‌ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని ఆయన తన సమాధానంలో పేర్కొన్నారు. అయితే మొదటి వేవ్‌ కన్నా రెండో దశ సమయంలో మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ మునుపెన్నడూ లేనంత పెరిగిందని తెలిపారు. మొదటి ప్రభంజనం సమయంలో 3,095 మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ ఉండేదని, ఇది రెండో ప్రభంజనంలో 9,000 మెట్రిక్‌ టన్నులకు చేరిందని వివరించారు. వైద్య, ఆరోగ్యం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని అంశమని తెలిపారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తాయన్నారు. మరణాలను నివేదించవలసిన విధానంపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సవివరమైన మార్గదర్శకాలను జారీ చేసినట్లు తెలిపారు. దీని ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతి నిత్యం కేసులు, మరణాల వివరాలతో కూడిన నివేదికలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపినట్లు పేర్కొన్నారు. అయితే ఆక్సిజన్‌ కొరత వల్ల సంభవించిన మరణాలంటూ నిర్దిష్టంగా తెలియజేయలేదన్నారు. మంత్రి చేసిన ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నది. దేశంలో ఉన్న డిమాండ్‌ను పట్టించుకోకుండా, విదేశాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసిన కారణంగానే పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ప్రియాంక ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆక్సిజన్‌ ఎగుమతులు 700 శాతం పెరగడం నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ఎలంటి చర్యలు తీసుకోలేదని కేంద్రంపై మండిపడ్డారు. ఆక్సిజన్‌ కొరత దేశాన్ని అతలాకుతలం చేసిందని, ఎంతో మంది రోగులు ఈ కారణంగా ప్రాణాలు విడిచారని ఆమె తెలిపారు. ప్రభుత్వం మాత్రం నిర్దిష్టమైన సమాచారం ఏదీ లేదని పేర్కొంటూ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. కేంద్రం చేసిన ప్రకటనలో ఏమాత్రం నిజం లేదని ఢిల్లీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌ బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. నిజంగానే ఆక్సిజన్‌ కొరతతో మరణాలు ఏవీ చోటుచేసుకోకుంటే, ఆస్పత్రులు ఎందుకు హైకోర్టులను ఆశ్రయిస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఆసుపత్రులు, మీడియా ఆక్సిజన్‌ కొరత వార్తలను చూస్తునే ఉన్నాయన్నది వాస్తవం కాదా? అని నిలదీశారు. ఆక్సిజన్‌ మరణాలు సంభవిస్తున్నాయని టీవీ ఛానల్స్‌ కూడా ప్రసారం చేశాయా లేదా అని నిలదీశారు. కేంద్ర వైఖరిని చూస్తుంటే, దేశంలో అసలు కరోనా వైరస్‌ లేనేలేదని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా సైతం ఇదే తరహా విమర్శలు గుప్పించారు. ఆక్సిజన్‌ సరఫరాపై కేంద్రానికి సరైన విధానం ఏమీ లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశంపై వివరాలు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కరోనా కట్టడి, ఆక్సిజన్‌, కీలక ఔషధాల అందుబాటుపై ప్రభుత్వానికి శ్రద్ధలేదని అన్నారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా చోటు చేసుకున్న మరణాలపై కేంద్రం తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నదని ఆరోపించారు. ఈ విధానాన్ని మానుకోవాలని హితవు పలికారు.

DO YOU LIKE THIS ARTICLE?