వలస బతుకు ఛిద్రం

రెండు రోడ్డు ప్రమాదాల్లో 30 మంది వలసకూలీలు మృతి

ఔరయ/భోపాల్‌: కరోనా లాక్‌డౌన్‌లో ఉపాధి లేక ఇతర రాష్ట్రాల నుంచి తమ స్వస్థలాలకు వెళ్తున్న వలస కూలీలను రోడ్డు ప్రమాదాలు బలిగొంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో 30 మంది వలసకూలీలు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ వద్ద శనివారం తెల్లవారుజామున రెం డు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో 24 మంది మృతి చెందగా, 36మందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 14 మంది పరిసస్థితి విషమంగా ఉందని చెప్పారు. వలస కూలీలు రాజస్థాన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు బీహార్‌, జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు. ఎదురెదురుగా వచ్చిన రెండు ట్రక్కులు బలంగా ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరో ప్రమాదం మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లాలో శనివారంనాడు చోటుచేసుకుంది. వలస కూలీలు ప్ర యాణిస్తున్న ట్రక్కు బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. వీరిలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన మరో 16 మందిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సాగర్‌ జిల్లా బాందా సమీపంలో ప్రమాదం జరిగిందని, ఆరుగురు దుర్మరణం పాలయ్యారని ఎస్‌పి అమిత్‌ సంఘీ మీడియాకు తెలిపారు. గాయపడిన వారంతా బాందాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని చెప్పారు. వలస కూలీలంతా మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు. వలస కూలీలను శ్రామిక్‌ రైళ్లు లేదా ప్రత్యేక బస్సుల ద్వారా మాత్రమే వారి స్వస్థలాలకు తరలించాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ప్రధానితో సహా పలువురు తీవ్ర దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్‌ రోడ్డు ప్రమాద దు ర్ఘటనలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉందని గుర్తుచేశారు. కాంగ్రె స్‌ సీనియర్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఈ ఘటనపై వి చారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. వలస కూలీల రక్షణకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సరైన మార్గదర్శకాలను రూపొందించి వలసకూలీలను వీలైనంత త్వరగా స్వస్థలాలకు చేర్చాలని కోరారు.

DO YOU LIKE THIS ARTICLE?