వలస కూలీలు ఆత్మహత్య

వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో విషాదం
బావిలో బయటపడిన నలుగురి మృతదేహాలు

ప్రజాపక్షం/వరంగల్‌ బ్యూరో : వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ నుండి వలస వచ్చిన కూలీల కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. బతుకుబారమై ఉపాధి లేక లాక్‌డన్‌ సమయంలో చేసేందుకు పనులు లేక ఆ కుటుంబం బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఘటన స్థానికులను ఎంతగానో కలిచి వేసింది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టగా, సొంత రాష్ట్రానికి పోయే వీలు లేక వీరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతుల్లో తల్లిదండ్రులతో పాటు ఒక బాలిక, బాలుడు ఉన్నారు. గొర్రెకుంట కోల్డ్‌ స్టోరేజ్‌ సమీపంలోని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఒకే కుటుంబానికి చెందిన వలస కూలీల మృతదేహాలను గురువారం సాయంత్రం బయటికి తీశారు. సాయంత్రం వరకు రెండు మృతదేహాలను బయటికి తీశారు. మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. మృతుల్లో తల్లిదండ్రులు ఎండి మసూద్‌, నిషా ఉన్నట్లు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు
వరంగల్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. పశ్చిమ బంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు మండలంలో స్థిరపడ్డారు. వీరంతా గోనెసంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం నుంచి కార్మికులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికలు చుట్టుపక్కల వారికోసం వెతికారు. వెతికే క్రమంలో శీతల గిడ్డంగి వద్దనున్న బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి మృతికి గల కారణాలు తెలియరాలేదు.

DO YOU LIKE THIS ARTICLE?