వలస కార్మికుల ప్రస్తావనేదీ?

వారి వెతల గురించి మాట్లాడకపోవం బాధ, దిగ్భ్రాంతిని కలిగించింది
సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి

ప్రజాపక్షం / హైదరాబాద్‌ : జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రసంగంలో లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న వలస కార్మికులు, వారి వెతల గురించి ప్రస్తావించకపోవ డం బాధ, దిగ్భ్రాంతి కలిగించిందని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నా రు. జిడిపిలో పది శాతం అంటే రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినా, వాటిని ఎలా ఉపయోగిస్తారనే అంశంపై అనుమానాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా బడ్జెట్‌లో కేటాయించిన నిధులు, పాత వాటిని కలిపి చేబితే పెద్ద ప్రయోజనం ఉండబోదని వ్యాఖ్యానించారు. ప్రధాని ప్రసంగంపై బుధవారం నాడు ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా సురవరం స్పందించారు. ప్యాకేజీ ఇచ్చే విషయంలో ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ప్యాకేజీ వ్యాపారవర్గాలకు ప్రయోజనం కలిగించే రీతిలో కాకుండా, పేద, మధ్యతరగతి, అసంఘటిత కార్మికుల కొనుగోలు శక్తి పెంచే విధంగా ఉండాలని సూచించారు. ప్రజల చేతుల్లో డబ్బు ఉండాలని, ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పవడం, వేతనాలకు కోతలు పడడంతో వారికి పరిహారం గా ఉచితంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నదన్నారు. వీరి కొనుగోలు శక్తి పెరిగితేనే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని, అలా కాకుం డా వ్యాపార సంస్థలు, కంపెనీలు, యాజమాన్యాలకు ఉద్దీపన ప్యాకేజీలు కల్పిస్తే ప్రయోజనం ఉండబోదన్నారు. కొవిడ్‌ మాటున కేంద్ర ప్రభు త్వం అధికారాలను కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నిస్తోందని, అందులో భాగంగా రైతులు, పేదలపై భారం వేస్తూ, రాష్ట్రాల హక్కులను లాక్కుంటూ విద్యత్‌ సవరణ బిల్లును తీసుకొని వచ్చిందన్నారు. మరోవైపు బిజెపి పాలిత రాష్ట్రాలో వెయ్యి రోజులపాటు మూడు మినహా 33 కార్మిక చట్టాలు వెయ్యి రోజుల పాటు అమలు లేకుండా చేశారని, ఏ కార్మిక సంఘంతో చర్చించి ఈ నిర్ణయాలు తీసుకున్నారని ప్రశ్నించారు.

DO YOU LIKE THIS ARTICLE?