వలస కార్మికులు రోడ్డెక్కారు!

కట్టలు తెంచుకుంటున్న ఆగ్రహం
‘ఇడిచి పెడితే నడిచి పోతా’ అంటూ రహదారులపైకి
రామగుండంలోని ఎన్‌టిపిసి, హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఆందోళన
వలస కార్మికులపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు
పలు ప్రాంతాల్లో బస్సు, రైలు స్టేషన్ల వద్ద నిరీక్షణ

ప్రజాపక్షం/హైదరాబాద్‌: వలస కార్మికుల ఆందోళనలు కట్టలు తెచ్చుకుంటుంది. బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే చిక్కుకోవడం, వారిని సొంత గూటికి పంపించేందుకు జరుగుతున్న జాప్యంతో వారు సహనాన్ని కోల్పోతున్నారు. దీంతో ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళనకు దిగుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని కంది ఐఐటి ఘటననే ఇందుకు నిదర్శనం. ఆ తర్వాతనైనా న్యాయం జరుగుతుందని ఎదురుచూస్తున్న వలస కార్మికులకు పెద్దగా భరోసా కనిపించడం లేదు. పైగా ప్రస్తుత కష్టకాలంలో ఇంటికాడానే ఉండాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు పలు చోట్ల వలస కార్మికులకు సరైన సౌకర్యాలు, చేసిన పనులకు వేతనాలు కూడా లేకపోవడంతో వారి కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అందుకే “ఇడిచి పెడితే నడిచి పోతా’ అంటూ రహదారులపై వస్తున్నారు. అడ్డుకుంటే అక్కడే బైఠాయిస్తున్నారు. తాజగా రామగుండంలోని ఎన్‌టిపిసి, హైదరాబాద్‌లోని టోలిచౌకి ప్రాంతాల్లో వలస కార్మికులు ఆందోళనకు దిగారు. అయితే వారిని సముదాయించాల్సిన పోలీసులు రామగుండం ఎన్‌టిపిసి వద్ద వలస కార్మికులపై లాఠీలో ప్రయోగించారు. వారిని అక్కడి నుంచి చెదరగొట్టేందుకు లాఠీలను ఝులిపించారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నది. మరోవైపు వలస కార్మికుల కోసం ప్రత్యేకంగా రైళ్లను ఏర్పాటు చేశారనే వార్తలు కూడా వారిని రోడ్లపైకి రప్పిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో బస్సు, రైలు స్టేషన్ల వద్ద నిరీక్షిస్తున్నారు. వారిని అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు సూచిస్తున్నప్పటికీ కొందరు మాత్రం సేమీరా అంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో కనీసం వారికి ఆహారం, నీటి సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. రామగుండుంలో ఎన్‌టిపిసి రాజీవ్‌ రహదారిపై వలస కార్మికులు ఆందోళనకు దిగారు. వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు నిరసన తెలిపారు. తమను సొంత ఊర్లకు పంపించాలని సమీప పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. గడిచిన రెండు రోజులుగా పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతోనే తాము ఆందోళనకు దిగామని వారు పేర్కొన్నారు. అక్కడే  రోడ్డుపై బైఠాయించారు. దీంతో వారిని అక్కడి నుండి పోలీసులు చెదర గొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారిపై లాఠీలను ప్రయోగించారు. ఆ వెంటనే అక్కడికి ఎంఎల్‌ఎ కోరుకంటి చందర్‌ చేరుకుని కార్మికులకు నచ్చజెప్పారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రెండు రోజుల్లో వారి వారి రాష్ట్రాలకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆయన హామీనిచ్చారు. దీతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అదే విధంగా హైదరాబాద్‌లోని టోలిచౌకి వద్ద వలస కార్మికులు ఆందోళనకు దిగారు. తమను సొంతూళ్లకు పంపించాని డిమాండ్‌ చేస్తూ సుమారు వెయ్యిమంది వలస కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. లాక్‌డౌన్‌లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రవాణా సౌకర్యాలు కల్పించి తమను సొంత ప్రాంతాలకు తరలించాలని డిమాండ్‌ చేశారు. దీంతో స్థానికంగా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఈ విషయం తెలియగానే అక్కడకు పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. హైదరాబాద్‌ వెస్ట్‌ జోన్‌ డిసిపి ఎ.ఆర్‌ శ్రీనివాస్‌ అక్కడికి చేరుకుని వలస కార్మికులను సముదాయించారు. వలస కార్మికుల వివరాలను సేకరించి వారి వారి ప్రాంతాలకు తరలిస్తామని వారికి నచ్చజెప్పడంతో కార్మికులు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాగా ఆకలి బాధతో ఇబ్బందులు పడుతున్నామని వారు డిసిపి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే జిహెచ్‌ఎంసి జోనల్‌ కమిషనర్‌తో చర్చించి టోలీచౌకీ ప్రాంతంలో 5 అన్నపూర్ణ క్యాంటిన్లు ఏర్పాటు చేస్తామన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?