వలస కార్మికులు ఠాణాలకు క్యూ

ప్రజాపక్షం/హైదరాబాద్‌; వలస కార్మికులు ఠాణాలకు ‘క్యూ’ కడుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని కరోనా విజృంభిస్తున్నందున తాము సొంత ఊర్లకే పోతామంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. వలస కార్మికుల కోసం వారం రోజుల పాటు 40 రైళ్లను ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికులంతా ఒక్కసారిగా మంగళవారం రోడ్డెక్కారు. తమ సమీప పోలీస స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. సొంత ఊర్లకు పంపించాలని వలస కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కొన్ని పోలీస్‌ స్టేషన్ల వద్ద వందలాంది మంది కార్మికులు ఒక్కసారిగా ‘క్యూ’ కట్టడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి ఖాళీగా ఉన్న ప్రాంతాలకు, కమ్యూనీటి హాల్స్‌, ఫంక్షన్‌ హాల్స్‌కు తరలిస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికే వెళ్లి వారి వివరాలను సేకరిస్తున్నారు. ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు పోలీస్‌ స్టేషన్లలో పేర్లను నమోదు చేసుకుంటున్నారు. కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వలస కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా రాచకొండ,సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో వలస కార్మికుల వందలాంది సంఖ్యలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా తమకు కావాల్సిన ఆహారాన్ని అందించడం లేదని వలస కార్మికులు వాపోతున్నారు. తాము రొట్టెలను ఆహారంగా తీసుకుంటామని, అలాంటిది తమకు బియ్యం పంపిణీ చేస్తే ఎలా అంటూ పలువురు కార్మికులు వాపోతున్నారు. మరి కొందరు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా తమ వద్ద పైసలు లేవని ఆందోళన చెందుతున్నారు. గడిచిన నెల రోజుల నుండి తాము తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, అందుకే వెంటనే తమ సొంత ఊర్లకు పంపించాలని వలస కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?