వలసలు నిలిపివేత : అమెరికా సంచలన నిర్ణయం

వాషింగ్టన్‌: తమ దేశంలోకి వలసలను (ఇమ్మిగ్రేషన్‌) తాత్కాలికంగా నిలిపివేయాలని  కరోనా వైరస్‌ వ్యాప్తితో తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విట్టర్‌ వేదికగా వెల్లడించా రు. ‘ఓ అదృశ్య శక్తి(కరోనా వైరస్‌) దాడి నేపథ్యంలో అమెరికా పౌరుల ఉద్యోగాలను రక్షించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అందువల్లే అమెరికాలోకి వలసలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం. దీనికి సం బంధించిన ఉత్తర్వులపై నేను సంతకం చేయబోతున్నాను” అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఇది కార్యరూపం దాలిస్తే తదుపరి ఉత్తర్వుల వెలువడే వరకు విదేశీయులెవరూ అమెరికాలోకి ప్రవేశించేందుకు  అనుమతి ఉండదు. అమెరికాకు వలస వెళ్లే వారిలో భారతీయులు, చైనావాసులే అత్యధికం. అక్కడ పనిచేస్తున్న వారిలోనూ ఈ ఉభయ దేశ వాసులదే సింహభాగం. ట్రంప్‌ తాజా నిర్ణయంతో భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యం అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కరోనాతో 42,560 మంది మరణించారు. అలాగే పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరువైంది. దీంతో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు గత కొన్ని రోజులుగా అమలు చేస్తున్న షట్‌డౌన్‌ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. అక్కడి అధికారిక లెక్కల ప్రకారం 2.2 కోట్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా అనేక మంది అదే బాటలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా పౌరులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసకుంటున్నట్లు ట్రంప్‌ స్పష్టం చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?