వరంగల్‌కు మెట్రో రైల్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌: హైదరాబాద్‌ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ మహా నగరాభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు అధికారులను ఆదేశించారు. వరంగల్‌ మహానగరంలోని పెండింగ్‌ పనులు, భవిష్యత్‌ ప్రణాళికలపై బుధవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఉమ్మడి వరంగల్‌ జిల్లా నేతలతో మంత్రులు కెటిఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు సమీక్ష చేశారు. వరంగల్‌ నగరంలో 15 కిలోమీటర్ల మేరకు మోనో రైలు ప్రతిపాదనలతో పాటు హైదరాబాద్‌ తరహాలో మెట్రో రైల్‌ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మామునూర్‌ ఎయిర్‌ పోర్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి కెటిఆర్‌ వెల్లడించారు. వరంగల్‌ స్మార్ట్‌ సిటి పనులు ఎంతవరకు వచ్చాయని ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్‌ సిటి పనుల్లో భాగంగా వెంటనే నగరంలో వెయ్యి పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మించాలని, ఇవి కూడా ఈ దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో 250 పబ్లిక్‌ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, మొదటగా ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ వరంగల్‌ కు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో ముఖ్యంగా పేదల డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు 3900 మంజూరు చేశారని, వీటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. ఇందులో ఇప్పటికే 900 ఇండ్లు పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిని త్వరలో ప్రారంభించాలని సూచించారు. మిగిలిన 3000 ఇండ్లలో 2200 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇండ్ల నిర్మాణం కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల ప్రారంభం కాలేదని మంత్రి కెటిఆర్‌ దృష్టికి ఎంఎల్‌ఎలు తీసుకురావడంతో అక్కడ ఇండ్లు ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. దసరా నాటికి 3900 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న కాకతీయ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ అథారిటీ(కుడా) మాస్టర్‌ ప్లాన్‌కు మంత్రి కెటిఆర్‌ ఆమోదం తెలిపారు. వరంగల్‌ మహానగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్‌ చేరుతుందని మంత్రి కెటిఆర్‌ ఈ సందర్బంగా అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?