వడగాలులు దడపుట్టిస్తున్నాయ్‌

రెండు రోజుల నుంచి పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
మరో మూడు రోజుల వరకూ వడగాలులు
ప్రజాపక్షం / హైదరాబాద్‌ : కరోనా లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలల పాటు బందీలై ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్న జనాలకు వడగాలులు దడ పుట్టిస్తున్నాయి. మొన్నటి వరకు కాస్త సగటున అటూ ఇటుగా 40 డిగ్రీల వరకు ఉన్న పగటి ఉష్ణోగ్రత రెండు రోజుల నుండి పెరిగిపోయింది. ఖమ్మంలో బుధవారం అటు రాత్రి, పగలు రెండు పూట లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రత 43.8, కనిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. ఇక నిజామాబాద్‌, రామగుండం, ఆదిలాబాద్‌ నగరాల్లో కూడా 43.8 డిగ్రీలు ఎండ ఉన్నది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 27 నుండి 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. ఒక వైపు ఎండ, మరోవైపు వడగాలులతో ప్రజల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 24వ తేదీవరకు మరో మూడు రోజులు వడగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య దిశ నుండి వీస్తున్న వడగాలి, గాలిలో తేమ తగ్గడంతో ఎండలు పెరిగాయని పేర్కొంది. ఈ రోజుల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు నమోదవుతాయని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. సోమవారం నాడు అక్కడక్కడ చెదురు మదురు వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొంది. లాక్‌డౌన్‌, వాహనాలు బయట తిరగకపోవడం వంటి కారణాలు కూడా గత రెండు నెలలు వాతావరణంపై ప్రభావం చూపిందని, అందుకే మే నెలలో కూడా ఎండ కాస్త తక్కువగా అనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు మే చివరి వారం సమీపిస్తుండడంతో పాటు, వాహన సంచారం పెరగడంతో అటు వేడి, కాలుష్యం కూడా పెరిగింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రదేశం పగలు రాత్రి
ఆదిలాబాద్‌ – 43.8 22.6
భద్రాచలం – 42.5 26.4
హకీంపేట – 40 28.4
దుండిగల్‌ – 39.5 27
హన్మకొండ – 42.5 24.5
హైదరాబాద్‌ – 40.9 27.8
ఖమ్మం – 43.8 30.6
మహబూబ్‌నగర్‌ – 42 28.5
మెదక్‌ – 42.8 25.8
నల్లగొండ -42 24
నిజామాబాద్‌ -43.8 28.3
రామగుండం – 43.8 23.2

DO YOU LIKE THIS ARTICLE?