వడగండ్ల వాన బీభత్సం

తడిసి ముద్దయిన ధాన్యం కూలిన చెట్లు
నేలపాలైన మామిడి, దెబ్బతిన్న బొప్పాయితోట
రంగారెడ్డి జిల్లాలో పాకలు, రేకుల ఇళ్లు ధ్వంసం
తీవ్ర ఆవేదనలో రైతులు
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌

ప్రజాపక్షం/న్యూస్‌ నెట్‌వర్క్‌: రాష్ట్రంలో గురువారం రాత్రి నుంచి పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతా ల్లో ఈదురుగాలులతో వడగండ్లు పడ్డాయి. ఈదు రుగాలులతో కూడిన వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. ఉద్యానవన పంటలు దెబ్బతిన్నా యి. మామిడికాయలు రాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట వానపాలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని రైతు లు కోరుతున్నారు. ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం జిల్లాలో అకాలవర్షానికి రైతన్న మరోసారి దెబ్బతిన్నాడు. వారం రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న రైతులు కోలుకోకముందే శుక్రవారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం మరోసారి దెబ్బతీసింది. భయంకరమైన గాలుల కారణంగా పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మామిడి కాయలు నేలపాలయ్యాయి. బొప్పాయి, ఇతర పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కూరగాయల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం రూరల్‌, ఖమ్మం అర్బన్‌, రఘునాథపాలెం తదితర మండలాల్లో రైతాంగానికి నష్టం వాటిల్లింది. ఖమ్మం నగరంలోని పలు చోట్ల గాలి దుమారానికి చెట్లు కూలాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. స్థానిక జిల్లా పరిషత్‌ కార్యాలయంలో వృక్షాలు నేలకొరిగాయి. సిద్దిపేట జిల్లా ములుగు, గజ్వేల్‌ మండలాల్లో వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో అకస్మాత్తుగా కురిసిన వర్షం వల్ల మార్కెట్‌ యార్డుకు తరలించిన వరి ధాన్యం తడిసింది. పలు గ్రామాల్లో రాళ్ల వాన కురిసింది. దీంతో చేతికి వచ్చే పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే మామిడి కాయలు నేల రాలాయి. రాయికల్‌ మండలంలోని పలు గ్రామాల్లో పసుపు ఉడకబెట్టగా తడిసింది. కూరగాయల రైతులకు కూడా నష్టం వాటిల్లింది. ధర్మపురి మండలంలో భారీ వర్షం కురిసింది. ధర్మపురి మార్కెట్‌ యార్డులోని ధాన్యం తడిసింది. కొంత మేర టార్పాలిన్‌ కవర్లు కప్పి కాపాడుకున్నారు. ఇల్లందుకుంట మండలంలోని నర్సక్కపేట, పొత్తూర్‌, కందికట్కూరు, గాలిపెల్లి తదితర గ్రామాల్లో వరి పంట నీటి పాలైంది. మామిడి కాయలు నేలపాలయ్యాయి. రంగారెడ్డిజిల్లా కందుకూరు మండలం జబ్బారిగూడలో శుక్రవారం పొలాల్లోని పశువుల దొడ్లు, రేకుల ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొబ్బరితోటల్లోని చెట్లు ఒరిగాయి. అదేవిధంగా శంషాబాద్‌, మహేశ్వరం మండలాల్లో వడగళ్ల వర్షం కురిసింది. అలాగే జైతారం, రాచలూరు, గుమ్మదవెల్లి, ఆకుల మైలారం, దుబ్బచర్ల, అమీర్‌పేట, నాగారం, పెండ్యాల్‌ తదితర గ్రామాల్లో ఉరుములతో వర్షం కురిసింది. జిల్లా గోవిందరావుపేటలో గాలివానతో వరిపొలాలు ఒరిగిపోయాయి.. నీట మునిగాయి. అలాగే గాలి హోరుకు మామిడి కాయలు రాలిపోయాయి. లక్నవరం సరస్సు రంగాపూర్‌ ప్రధాన కాల్వ కింద వేసిన అయిదు వేల ఎకరాల్లోని వరి చేలు గింజలు నేలపాలయ్యాయి. వ్యవసాయ అధికారులచే సర్వే చేయించి నష్టపరిహరం చెల్లించాలని అధికారులను రైతులు కోరుతున్నారు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ధాన్య కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అంతేగాక పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. కరెంట్‌ స్తం భాలు ఒరిగిపోయాయి. సూర్యాపేట జిల్లాలో కోదాడ రూరల్‌ రామన్నపేట, అర్వపల్లి మండలాల్లో ఈదురు గాలులతో వడగళ్ల్ల వర్షం కురవడంతో ధాన్యం పూర్తిగా తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ్మర, కాపుగల్లు, గుడిబండ, రెడ్లకుంట, కూచిపూడి, యర్రవరం, రామలక్ష్మీపురం తదితర గ్రామాల్లో రైతులు కళ్లాల్లోను, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోను, రహదారుల వెంట ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడి, నిమ్మతోటల్లోని కాయలు ఈదురుగాలులకు నేలరాలిపోయాయి

DO YOU LIKE THIS ARTICLE?